వ్యాపారి ఇంటిపై ఈడీ దాడి
శివమొగ్గ: అక్రమ నగదు బదిలీ వ్యవహారాల ఆరోపణలతో జిల్లాలోని సాగరలో కెళది రోడ్డులోని నగరసభ సభ్యుడు, వ్యాపారి టిప్‌టాప్ బషీర్ ఇంటిపై శుక్రవారం ఈడీ అధికారులు దాడి చేశారు. మొత్తం ఏడుగురు అధికారులు ఏకధాటిగా 18 గంటల పాటు దాఖలాలను పరిశీలించారు. పలు రికార్డులను సీజ్ చేసి, బుధవారం విచారణకు రావాలని బషీర్‌కు నోటీసులిచ్చారు. దీనిపై బషీర్ స్పందిస్తూ ఓ హోటల్ వ్యవహారం గురించి, అందులో నావుంద ఇక్బాల్ భాగస్వామ్యం గురించి విచారణ చేశారన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానన్నారు. అన్ని దాఖలాలు పారదర్శకంగా ఉన్నాయన్నారు. ఖతార్ నుంచి నగదు బదిలీకి సంబంధించి అడిగిన ప్రశ్నలకు కూడా బదులిచ్చానని తెలిపారు.
విదేశీ పర్యటనలకు
అడ్డంకులా: మంత్రి ఖర్గే
శివాజీనగర: కేంద్ర ప్రభుత్వం తన అమెరికా పర్యటనలకు అనుమతులు ఇవ్వడం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్‌లో కేంద్ర ప్రభుత్వానికి వరుస ప్రశ్నలను వేశారు. జూన్ 14 నుంచి 27 వరకు అమెరికా సహా పలు ప్రపంచ దేశాలలో పెట్టుబడుల కోసం తాను పర్యటన జరపాలనుకుంటే కేంద్రం నుంచి అనుమతి లభించలేదని ఆరోపించారు. తన దరఖాస్తులను వరుసగా తిరస్కరించారు, ఎందుకో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. జూన్ 12న మీడియాతో ఈ అంశంపై ఘాటుగా మాట్లాడగా, అదే రోజు సాయంత్రం విదేశాంగశాఖ నిరాకరణను రద్దుచేసి అనుమతిని ఇచ్చిందన్నారు.
గాయకునికి కిలాడీ మోసం
యశవంతపుర: హెల్ప్‌లైన్ పేరుతో గాయకునికి మహిళ టోపీ వేసిన ఘటన మంగళూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గాయకుడైన కె.రాజేశ్ సంగీత కచేరీలను నిర్వహించేవాడు. ఈయన స్వస్థలం దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి. ఆయనకు గతేడాది ఫేస్‌బుక్ ద్వారా సంధ్య పవిత్ర అనే మహిళ పరిచయమైంది, ఈమెది బెంగళూరు అని తెలిసింది. మోసపోయిన వ్యక్తులకు సాయం చేస్తానని చెప్పుకొంది. ఓ వ్యవహారంలో హైకోర్టు ద్వారా కేసును పరిష్కారించుకోవాలని చెప్పి రాజేశ్ నుంచి రూ.3.2 లక్షలను పలు విడతలుగా వసూలు చేసింది. కానీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. రాజేశ్ నిలదీయగా, వేరేవాళ్లకు డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు కట్టుకథలు చెప్పిందామె. బాధితుడు గట్టిగా అడగడంతో, నీ కాళ్లు చేతులు విరిచేయిస్తానని సంధ్య బెదిరించింది. రాజేశ్ బెళ్తంగడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వ్యాపారి ఇంటిపై ఈడీ దాడి


