ప్రమాదకరంగా గుండెపోట్లు
మైసూరు: గత 20 ఏళ్లలో చూసిన దానికంటే గుండెపోటు సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి, ఒక్క మైసూరులోనే రోజూ 30 నుంచి 40 మంది గుండెజబ్బు అంటూ ఆస్పత్రికి వస్తున్నారు అని జయదేవ హార్ట్ ఆస్పత్రి నిపుణులు హెచ్చరించారు. నగరంలో వారు మాట్లాడుతూ గత నాలుగైదేళ్లుగా ఎక్కువ మంది యువకులు గుండెపోటుకు గురవుతున్నారు. ఆకస్మికంగా గుండెపోటులు సంభవిస్తున్నాయని, చికిత్సకు కూడా సమయం ఉండడం లేదని తెలిపారు. 18 నుంచి 20 ఏళ్ల యువతీ యువకులు ఆకస్మికంగా మరణిస్తుండడం దిగ్భ్రాంతికరమని అన్నారు. ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా గుండెపోట్లు వస్తున్నాయని, మారిన జీవన విధానాలు, ఒత్తిడితో కూడిన జీవితమే దీనికి ప్రధాన కారణమని తెలిపారు. వివాహాలు, పార్టీల సందడిలో, నృత్యం చేస్తున్నప్పుడు హఠాత్తుగా పడిపోయి చనిపోతున్నారని, కన్నడ హాస్య నటుడు రాజేష్ పూజారి ఉదంతమే నిదర్శనమని అన్నారు. కోవిడ్ వైరస్ రక్తనాళాలకు నష్టం కలిగిస్తుందని, ఎక్కువకాలం కోవిడ్‌కు గురికావడం వల్ల గుండెపోటు వస్తుందని అన్నారు. 2020 నుంచి గుండెపోటు కేసులు పెరిగాయని, ఏటా రోజుకు 15 మంది ఈ సమస్యతో వస్తున్నారని తెలిపారు.
కోవిడ్ వచ్చాక మరింత అధికం: నిపుణులు


