
కంపెనీ బస్సు పల్టీ, 35 మందికి గాయాలు
● ఎయిర్‌పోర్టు వద్ద ప్రమాదం
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ ఎయిర్‌పోర్టు వద్ద ప్రైవేటు నిర్మాణ కంపెనీ సిబ్బందితో వెళ్తున్న బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టగా, పెద్దసంఖ్యలో గాయపడిన సంఘటన మంగళవారంనాడు బేగూరు జంక్షన్‌లో జరిగింది. షిఫ్టు ముగిసిన ఉద్యోగులు మధ్యాహ్నం భోజనానికని కంపెనీ బస్సులో మెస్‌కు వెళ్తుండగా సీఐఎస్‌ఎఫ్ సర్కిల్‌లో డ్రైవర్ అతి వేగంతో ఎడమ వైపునకు తిప్పడంతో ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 35 మంది ఉండగా అందరికీ గాయాలైనట్లు తెలిసింది. బాధితుల్లో ఒకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. మృతున్ని యూపీ కి చెందిన సంతోష్ యాదవ్‌గా (35)గా గుర్తించారు. మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇంకా 10 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ అని బస్సు డ్రైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
డీకేశి కేసులో వాదనలు
శివాజీనగర: డిప్యూటీ సీఎం డీ.కే.శివకుమార్ అక్రమార్జనకు పాల్పడ్డారంటూ సీబీఐ దాఖలు చేసిన కేసు, అలాగే బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ దాఖలు చేసిన రిట్ అర్జీ మీద బుధవారం సుప్రీంకోర్టులో వాదనలు జరిగాయి. డీకేశి ప్రభుత్వంలో ప్రభావశీలమైన వ్యక్తి, ఆయన బెయిల్‌ను రద్దు చేయాలని వాదనలు సాగాయి. డీకే వకీలు వాదిస్తూ రిట్ పిటిషన్‌కు అర్హత లేదని పేర్కొన్నారు. డీకే మీద దాఖలైన ఎఫ్‌ఐఆర్‌ను కర్ణాటక ప్రభుత్వం రద్దు చేసిందని చెప్పారు. వాదనల తరువాత జడ్జి విచారణను జూలైకి వాయిదా వేశారు. మరోవైపు పహల్గాం దాడి, సైనికుల పోరాటం నేపథ్యంలో నేడు గురువారం తన పుట్టినరోజు వేడుకలను ఎవరూ జరపరాదని డీకే శివకుమార్ మరోసారి విజ్ఞప్తి చేశారు. బెంగళూరులో ఉండనని, ఎవరూ తనకోసం రావద్దని కోరారు.
రమణీయం.. రోకలి కరగ
కోలారు: నగరంలోని పిసి కాలనీలో ఉన్న రేణుకా యల్లమ్మ దేవి వసంత ఉత్సవంలో భాగంగా బుధవారం ఒనకె (రోకలి) కరగ ఉత్సవం కమనీయంగా సాగింది. వందల సంఖ్యలో భక్తులు చేరి రంగులు చల్లుకున్నారు. తరువాత కరగ పూజారి మంజునాథ్ తలపై పొడవైన రోకలిపై తామ్ర పాత్రను ఉంచుకుని నృత్యం చేశారు. పాత్రలోని నీళ్లు భక్తులపై పడడం శుభదాయకమని నమ్ముతారు. గంటకు పైగా జరిగిన ఒనకె కరగ ఉత్సవాన్ని చూసి భక్తులు తరించారు.
దొంగ అని బాలుని హతం
● అథణిలో దారుణం
● ఆరుగురు అరెస్టు
సాక్షి, బెంగళూరు: బాలున్ని అకారణంగా హత్య చేశారు. బెళగావి జిల్లా అథణి పట్టణం శివార్లలోని నిర్మానుష్య ప్రాంతంలో మే 1న కుళ్లిపోయిన స్థితిలోఒక అపరిచిత బాలుని మృతదేహం కనిపించింది. పట్టణ పోలీసులే అంత్యక్రియలు కూడా చేశారు. తాజాగా కేసు మిస్టరీ వీడిపోయింది. బాలుడు అథణి తాలూకా అరళిహట్టి గ్రామానికి చెందిన వికాస్ శివదాస కోష్టి (16) గా గుర్తించారు. ఇది హత్య అని తేల్చారు. ఈ హత్య కేసులో ఆరు మంది నిందితులను పోలీసులు అరెస్టు కూడా చేశారు. నిందితులు అబ్దుల్ బారీముల్లా (36), జుబేర అహ్మద్‌మౌల్వీ (34), బిలాల్ అహ్మద్ మౌల్వీ (25), హజరత్ బిలాల్ నలబంద్ (27), మహశ్ కాళే (36) అనేవారు.
ఎలా జరిగింది
అథణి పట్టణ శివార్లలోని మహష్ కాళేకు ఫర్నిచర్ షాప్ ఉంది. ఆ షాప్ వద్ద బాలుడు ఉండగా దొంగతనం చేసేందుకు వచ్చాడని పట్టుకుని నిందితులు హింసించారు. రాత్రి అంతా షెడ్‌లో కట్టేసి కొట్టడంతో అతడు మరణించాడు. హత్యను దాచేందుకు వికాస్ శవంపై యాసిడ్ పోసి ఆ తర్వాత డ్రైనేజీలో పడేశారు. ఈ దారుణంపై పట్టణవాసుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కంపెనీ బస్సు పల్టీ, 35 మందికి గాయాలు

కంపెనీ బస్సు పల్టీ, 35 మందికి గాయాలు