
లంచగొండి ఇంజినీరు, లెక్కాధికారి అరెస్టు
మైసూరు: కావేరి నీరావరి నిగమ ఈఈ కావేరి రంగనాథ్, లెక్కాధికారి ఉమా మహేశ్వర్ లోకాయుక్త వలలో చిక్కారు. వివరాలు.. జిల్లాలోని నంజనగూడులో కాంట్రాక్టర్ అబ్దుల్ అజీజ్ నుంచి రూ.1.45 లక్షల లంచం సొమ్మును తీసుకుంటుండగా ఇద్దరినీ అరెస్టు చేశారు. చామరాజనగర తాలూకాకు చెందిన అబ్దుల్ అజీజ్ నీరావరి నిగమలో క్లాస్–1 కాంట్రాక్టర్‌గా ఉన్నారు. నిగమ నుంచి ఆయన చేసిన ఐదు పనులకు రూ.23 లక్షల బిల్లు బకాయి ఉంది. ఆ బిల్లును చెల్లించేందుకు అధికారులు 6 శాతం కమీషన్ చొప్పున రూ.1.45 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో కాంట్రాక్టర్ ఈ విషయాన్ని లోకాయుక్త అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈఈ ఆఫీసులోనే లంచం తీసుకుంటూ ఉండగా లోకాయుక్త డీఎస్పీ మ్యాథ్యూ థామస్, ఇన్‌స్పెక్టర్ శశికుమార్, రవికుమార్, సిబ్బంది దాడి జరిపి లంచగొండి అధికారులను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి విచారణ చేపట్టారు.