
ఎయిమ్స్ ఏర్పాటుపై రాజకీయం తగదు
రాయచూరు రూరల్: రాయచూరులో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఏర్పాటు విషయంలో రాజకీయాలు చేయడం తగదని ఎయిమ్స్ పోరాట సమితి సంచాలకుడు అశోక్ కుమార్ జైన్ పేర్కొన్నారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొండి చెయ్యి చూపడాన్ని తప్పుబట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్, దేశంలో బీజేపీ సర్కార్లు కలిసి రాయచూరులో మహాత్మ గాంధీ మైదానంలో చేపట్టిన ఆందోళన 1042 రోజుకు చేరిందన్నారు. రాజకీయ నాయకుల చిత్తశుద్ధి లోపంతో పాటు మంజూరుకు అడ్డు తగులుతున్నారని ఆరోపించారు.
తేనెటీగల దాడిలో ఒకరు మృతి
● మరొకరి పరిస్థితి విషమం
హుబ్లీ: ఫోటో తీసుకుంటుండగా తేనెటీగలు దాడి చేయడంతో ఓ యువకుడు మృతి చెందాడు. హుబ్లీ నుంచి గోకర్ణకు వెళుతున్న నలుగురు మిత్రులు అంకోలా తాలూకా హొసకంబి వంతెన వద్ద తమ కారును నిలిపి ఫోటో తీసుకోవడానికి ప్రయత్నించారు. ఆసమయంలో ఆకస్మికంగా తేనెటీగలు దాడి చేశాయి. ఒక కి.మీ. దూరం వరకు పరుగెత్తినా తేనెటీగలు వెంటాడాయి. ఈక్రమంలో దూరంలో ఉన్న కారును తెచ్చి చికిత్స కోసం ఆస్పత్రికి వెతుక్కుంటూ ఎలాగోలా ఆ రాత్రి వేళ ప్రైవేట్ ఆస్పత్రికి చేరారు. ఇంతలో వారిలో ఒకరు హుబ్లీకి చెందిన ఆదర్శ్ కళసూర మృతి చెందాడు. మిగిలిన ముగ్గురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స కోసం కుమటా ఆస్పత్రికి తరలించారు. గోకర్ణ సీఐ శ్రీధర్, ఎస్‌ఐ ఖాదర్ బాషా తమ సిబ్బందితో కలిసి ఆస్పత్రికి వెళ్లి తేనెటీగల దాడి బాధితులను పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడు దుర్మరణం
రాయచూరు రూరల్: నగరంలో మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడిని రైల్వే స్టేషన్ రోడ్డులో ద్విచక్రవాహనం మీద వెళుతున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన సురేష్ కుమార్(30)గా పోలీసులు గుర్తించారు. స్టేషన్ నుంచి అంబేడ్కర్ సర్కిల్‌కు వెళుతున్న సురేష్ కుమార్‌ను ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించినట్లు సీఐ మేకా నాగరాజ్ వెల్లడించారు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం రిమ్స్ ఆస్పత్రికి తరలించి లారీ డ్రైవర్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
24న అప్రెంటిస్‌షిప్ పోస్టులకు ఇంటర్వ్యూలు
హుబ్లీ: ధార్వాడ టాటా మోటర్స్ కంపెనీ ఆధ్వర్యంలో 2025లో పీయూసీ, ఆర్ట్స్, కామర్స్ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యాగిరి జనతా విద్యా సమితి ఉత్సవ సభాభవనంలో ఈ నెల 24న ఉదయం 9.30 గంటలకు అప్రెంటిస్‌షిప్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరగనున్నాయి. 16 నుంచి 20 ఏళ్ల వయస్సు ఉన్న 10 తరగతిలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 60 శాతం మార్కులతో పాటు గణితం, సైన్స్‌లలో 70 శాతం మార్కులు సాధించి ఉండాలి. అప్రెంటిస్‌షిప్ శిక్షణ రెండేళ్ల పాటు ఉంటుంది. ఎంపికై న అభ్యర్థులకు యూనిఫాంతో పాటు ప్రతి నెల రూ.13 వేలు స్కాలర్‌షిప్ అందజేస్తారు. బస్సు వసతి కూడా ఉంటుంది. ఆసక్తి గల విద్యార్థులు 7022402503 నెంబరులో సంప్రదించి తమ పేర్లను నమోదు చేసుకోవాలని నిర్వాహకులు ఓ ప్రకటనలో కోరారు.
ఏబీసీడీ వర్గీకరణకు డిమాండ్
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసి నెలలు గడిచినా ప్రభుత్వం స్పందించలేదని సాంఘీక న్యాయ ఎస్సీ ఐక్య పోరాట సమితి సంచాలకుడు రవీంద్రనాథ్ పట్టి ఆరోపించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 30 ఏళ్ల నుంచి మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణ చేయాలంటూ ఆందోళనలు చేపట్టినా, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్‌కు వర్గీకరణ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినా మౌనం వహించడాన్ని ఖండించారు. ప్రభుత్వం నాగమోహన్ దాస్ నివేదికను తొక్కి పెట్టిందన్నారు. కుల వర్గీకరణపై మంత్రి మహదేవప్ప చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

ఎయిమ్స్ ఏర్పాటుపై రాజకీయం తగదు

ఎయిమ్స్ ఏర్పాటుపై రాజకీయం తగదు