కోలారు: కర్ణాటక మహర్షి వాల్మీకి ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి మండలి అధికారి చంద్రశేఖర్ ఆత్మహత్యకు కారకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె నారాయణగౌడ డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 గ్యారెంటీలను అమలు చేయడం కోసం నిధులు లేక అధికారులపై ఒత్తిడి పెంచుతోందన్నారు. ఆ ఒత్తిడిని తాళలేక అధికారి ఆత్మహత్య చేసుకున్నాడని, దీనికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. వివిధ నిధులను నకిలీ దాఖలాలు సృష్టించి లూటీ చేశారన్నారు. ఇందుకు అంగీకరించని అధికారిపై తీవ్ర ఒత్తిడి తెచ్చారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయన్నారు. వాల్మీకి అభివృద్ధి మండలిలో మంత్రి ఒత్తిడితోనే అక్రమాలు జరిగాయన్నారు. దీనిని సహించలేకనే నిజాయతీ అధికారి చంద్రశేఖర్ డెత్‌నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అధికారి కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు సంఘం పదాధికారులు మరగల్ శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు ఈకంబళ్లి మంజునాథ్, తాలూకా అధ్యక్షుడు కదరినత్త అప్పోజిరావ్, మునికృష్ణ, శైలజ, రాధ, చౌడమ్మ సుధా తదితరులు పాల్గొన్నారు.