బనశంకరి: డబ్బు కోసం ఓ వ్యక్తిని అపహరించి రూ.45 లక్షలకు డిమాండ్ పెట్టిన కేసు దర్యాప్తు వేగవంతం చేసిన నగర పోలీసుల శాఖ ప్రాథమిక నివేదిక ఆధారంగా పీఎస్‌ఐతో పాటు ముగ్గురు పోలీసులను శుక్రవారం వైట్‌ఫీల్డ్ విభాగ డీసీపీ గిరీశ్ సస్పెండ్ చేసి దర్యాప్తునకు ఆదేశించారు. బాగలూరు నివాసి రామాంజనేయ అనే వ్యక్తిని అపహరించి డబ్బు డిమాండ్ చేసిన మారతహళ్లి పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ రంగేశ్, హెడ్‌కానిస్టేబుల్ హరీశ్, మహదేవ్, మహేశ్‌లను డీసీపీ గిరీశ్ సస్పెండ్ చేశారు. రామాంజనేయ పులిచర్మాలు, గోర్లు విక్రయానికి ప్రయత్నించారు. ఇతడి అనుచరుడైన సిద్దమల్లప్ప అనే వ్యక్తి పోలీస్ ఇన్‌ఫార్మర్లుగా ఉన్న షబ్బీర్, జాకీర్‌కు సమాచారం ఇచ్చారు. ఈ విషయం షబ్బీర్ ఎస్‌ఐ రంగేశ్ బృందానికి తెలిపారు. దాడి చేసిన పోలీస్‌లు రామాంజనేయ వద్ద గల బ్యాగ్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా అవి నకిలీ పులిచర్మం, గోర్లుగా తేలాయి. నకిలీ పులిచర్మం, పులి గోర్లు అని తెలియగానే కోపోద్రిక్తుడైన ఎస్‌ఐ రంగేశ్ పట్టుబడిన రామాంజనేయను పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లకుండా కారులో నగరమంతా తిప్పాడు. రెండు రోజుల అనంతరం మారతహళ్లి పోలీస్‌స్టేషన్ పక్కన ఇంట్లో రామాంజనేయను బంధించాడు. రామాంజనేయ తండ్రి శివరామయ్యకు ఎస్‌ఐ రంగేశ్ ఫోన్ చేసి విషయం తెలిపి మీ కుమారుడిపై కేసు నమోదు చేయకూడదంటే రూ.45 లక్షలు ఇవ్వాలని చెప్పి ఫోన్ కట్ చేశాడు. కుమారుడిని కిడ్నాప్ చేశారని శివరామయ్య 21న బాగలూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు హెడ్‌కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేశారు. ఇదే సమయంలో ఎస్‌ఐ రంగేశ్ పరారయ్యాడు.
పోలీస్ కమిషనర్ హెచ్చరిక
పోలీస్ అధికారులు, సిబ్బంది అక్రమ వ్యవహరాల్లో భాగస్వాములైతే కఠినచర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్.ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు. బాగలూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో పోలీస్‌లు ఓ వ్యక్తిని అపహరించి రూ.45 లక్షలకు డిమాండ్ చేసిన కేసుకు సంబంధించి స్పందించిన కమిషనర్ ఇలాంటి అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పీఎస్‌ఐ పరారీలో ఉండగా ఇతడి కోసం గాలిస్తున్నామని దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.
ముగ్గురు పోలీసుల అరెస్ట్
మారతహళ్లి పీఎస్‌ఐ పరారీ