
గంగావతి: శ్రీరామనగర్‌లో గురువారం బీజేపీ కార్యాలయాన్ని కనకగిరి ఎమ్మెల్యే బసవరాజ్ దఢేసూగూరు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్నందున కార్యకర్తలు, నాయకులు బూత్‌ల వారీగా శ్రమించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో బాపారావు, దుర్గారావు, రామకృష్ణ, నరాల శ్రీనివాస్, ప్రభాకర్, భాస్కర్, నాగేశ్వరరావు, అన్య చంద్రశేఖర్, వెంకటకృష్ణ పాల్గొన్నారు.
సిద్దేశ్వరుడికి పుష్పార్చన
హుబ్లీ: చారిత్రక సిద్దేశ్వర రథోత్సవానికి హెలికాప్టర్ ద్వారా పుష్పార్చన సమర్పించి కనుల పండువగా జాతర నిర్వహించారు. తొలుత పూలతో అలంకరించిన పల్లకీలో ఉత్సవ మూర్తిని ప్రదర్శన ద్వారా తీసుకొచ్చి ప్రతిష్టించారు. ప్రదర్శన పొడవున వివిధ వాయిద్యాలతో నృత్యాలు ప్రదర్శించారు. కాగా భక్తులు అరటి పండ్లను రథం పైకి విసిరి భక్తిని చాటుకున్నారు.
కరెంటు షాక్‌తో లైన్‌మ్యాన్ మృతి
దొడ్డబళ్లాపురం: ట్రాన్స్‌ఫార్మర్ రిపేరీ చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి లైన్‌మ్యాన్ మృతిచెందిన సంఘటన మాగడి తాలూకా కళ్లిపాళ్య గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్‌లో సమస్య కావడంతో ముద్దేబిహాళ గ్రామానికి చెందిన లైన్‌మ్యాన్ శరణబసప్ప (30) వచ్చి మరమ్మతు చేస్తుండగా హఠాత్తుగా విద్యుత్ ప్రవహించి షాక్ తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. బెస్కాం నిర్లక్ష్యం వల్లే లైన్‌మ్యాన్ మృతిచెందినట్టు గ్రామస్తులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
నాట్య ప్రదర్శనలు అదుర్స్
గంగావతి: ఆనెగుంది సమీపంలోని అంజనాద్రి బెట్టపై ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రదర్శించిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు అబ్బురపరిచాయి. హొసపేటెకు చెందిన అంజలి బృందం భరతనాట్యం, హులిగి శృతి హ్యాటి బృందం, ఆనెగుంది అంజన బృందాలు పలు నృత్య, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. కొండపై ఈ ఏడాది ఆలయ కమిటీ ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం విశేషం.
శ్రీశైలం భక్తులకు అన్నసంతర్పణ
రాయచూరు రూరల్ : మల్లికార్జునుడి దర్శనార్థం శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చిన కళ్యాణ, ఉత్తర కర్ణాటక భక్తులకు నగరంలోని క్రీడామైదానంలో నవ చేతన పాఠశాల ఆధ్వర్యంలో గురువారం అన్నసంతర్పణ గావించారు. సోమవారపేట మఠాధిపతి అభినవ రాచోటి శివాచార్యులు, ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్, లక్ష్మికాంత్‌రెడ్డిలు భోజనం వడ్డించారు.
మోసకారి ముఠా అరెస్టు
బనశంకరి: ఆర్‌బీఐ పేరుతో నకిలీ రికార్డులు సృష్టించి కోట్లాదిరూపాయలు వంచనకు పాల్పడిన 8 మంది గ్యాంగ్ ను గురువారం సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. వంచకులు నకిలీ రికార్డులు సృష్టించి విదేశాల నుంచి రూ.75 వేల కోట్లు నగదు వచ్చింది దీనిని డ్రాచేయడానికి సుమారు రూ.150 కోట్లు నగదు కావాలని నమ్మించి వంచనకు పాల్పడ్డారు. నిందితులు అశోక్‌కుమార్, రమేశ్‌కుమార్, మంజునాథ్, రాజ్‌కుమార్, గంగరాజు, కుమారేశ్, మూర్తినాయక్, సిద్దరాజునాయక్‌లు. వీరిపై సుబ్రమణ్యపుర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు.
కలబుర్గి కార్పొరేషన్ బీజేపీ పరం
రాయచూరు రూరల్ : గత 18 నెలలుగా ఖాళీగా ఉన్న కలబుర్గి సిటీ కార్పొరేషన్ మేయర్, ఉప మేయర్ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్‌గా బీజేపీకి చెందిన విశాల్ ధర్గి, ఉప మేయర్‌గా శివానంద పిస్తి ఎన్నికయ్యారు. కలబుర్గి సిటీ కార్పొరేషన్‌లో మొత్తం 55 మంది సభ్యులున్నారు. బీజేపీకి 22 మంది కార్పొరేటర్లు, ముగ్గురు ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎమ్మెల్సీ, ఎంపీల సంఖ్యాబలం ఉంది. అధికారం పీఠం కోసం 35 మంది సభ్యుల బలం అవసరం. బీజేపీ తన సంఖ్యాబలంతో అధికార పీఠం చేజిక్కించుకుంది. బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు.

ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే బసవరాజ్


విశాల్ ధర్గి శివానంద పిస్తి

శరణబసప్ప(ఫైల్)