సర్పంచ్‌లు వర్సెస్ ఉపసర్పంచ్‌లు
గ్రామపంచాయతీల్లో జాయింట్ చెక్‌పవర్ వివాదం
తెరపైకి కార్యదర్శికి చెక్ పవర్ యోచన
అభివృద్ధికి ఆటంకంగా ఆధిపత్య పోరు
కరీంనగర్‌టౌన్: గ్రామపంచాయతీల్లో అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్ పవర్ కల్పించింది. ఇదంతా బాగానే ఉన్న క్షేత్రస్థాయిలో మాత్రం సర్పంచ్, ఉపసర్పంచ్‌ల మధ్య జాయింట్ చెక్ పవర్ విభేదాలకు కారణమవుతుంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త పంచాయతీరాజ్ చట్టం అమలు, నేరుగా పంచాయతీలకు నిధుల మంజూరు, ప్రతీ పంచాయతీకి కార్యదర్శి నియామకం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. సర్పంచ్, ఉపసర్పంచ్‌లకు జాయింట్ చెక్‌పవర్ కావడంతో ఇద్దరి సమ్మతి లేనిదే నిధులు డ్రా చేసేందుకు వీలు లేకుండాపోయింది. దీంతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం చలాయించేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు గ్రామస్థాయిలోనే సమస్యలు పరిష్కరించుకుంటుండగా, కొన్ని గ్రామాల్లో నిధుల వినియోగంపై సమన్వయం లేక అధికారుల వద్దకు పంచాయితీలు వస్తున్నాయి. ఎన్నికలు జరిగి 9 నెలలు అవుతున్నా గ్రామస్థాయి రాజకీయాలు చల్లారడం లేదు. మాట వినని సర్పంచ్‌లను తమదారికి తెచ్చుకునేందుకు కొందరు ఉపసర్పంచ్‌లు చెక్‌లపై సంతకాలు చేసేందుకు నిరాకరిస్తున్నారు. జిల్లాలో మొత్తం 318 గ్రామపంచాయతీలకు గాను 50 శాతానికి పైగా గ్రామాల్లో వివాదాలే కనిపిస్తున్నాయి. అయితే వాటాల పంపకంలో తేడాలు రావడంతోనే చెక్‌పవర్ సమస్యలు తలెత్తుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎక్కువ మంది సర్పంచ్, ఉపసర్పంచ్‌లు నిరక్షరాస్యులు కావడంతోనే నూతన పంచాయతీరాజ్ చట్టం, విధులు, బాధ్యతలపై అవగాహన కరువైనట్లు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో పంచాయతీరాజ్ అధికారులు చట్టాలపై అవగాహన కల్పిస్తే కొంత మేరకై నా వివాదాలు సద్దుమనిగే అవకాశం ఉంటుంది.
చెక్ పవర్‌లో మార్పులకు యోచన!
గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై ఉమ్మడి చెక్ పవర్ నిబంధనల్లో మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుతం సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరూ సంతకాలు చేస్తేనే చెక్కులు చెల్లుబాటవుతున్నాయి. సమన్వయం లేక పలు గ్రామాల్లో చాలా చెక్కులు నిలిచిపోయి అభివృద్ధి పనులు, సిబ్బంది జీతాల చెల్లింపులకు ఆటంకం ఏర్పడుతోంది. కొత్త నిబంధనల ప్రకారం ఉపసర్పంచ్ వారంలోగా చెక్కుపై సంతకం చేయాల్సి ఉంటుంది. నిరాకరిస్తే కారణాన్ని కలెక్టర్‌కు తెలియజేయాలి. నిర్ణీత సమయంలో సంతకం చేయకుంటే కలెక్టర్ అనుమతితో పంచాయతీ కార్యదర్శి సంతకంతో చెక్కు ఆమోదించే అవకాశం ఉంటుంది. పదేపదే నిరాకరిస్తే చెక్ పవర్ శాశ్వత రద్దుకు షోకాజ్ నోటీసులు జారీ చేయనున్నట్లు నిబంధనలు రానున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.
పోటాపోటీగా ఫిర్యాదులు
గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్‌లు రెండువర్గాలుగా విడిపోయి పోటీపోటీగా అధికారులకు ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు దఫాలుగా సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో పోటాపోటీగా ఫిర్యాదు చేస్తున్నారు.
ఎవరికి వారే యమునా తీరే
గ్రామస్థాయి నాయకులకు రాజకీయ అండదండలు పుష్కలంగా ఉండడంతో పార్టీలవారీగా విడిపోతు న్న సర్పంచ్, ఉపసర్పంచ్‌లు ఎవరిదారి వారిదే అ న్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు, అవినీతి అక్రమాలపై ఫిర్యాదులు వస్తుండగా, మరికొన్ని గ్రామాల్లో సర్పంచ్‌ల ఒంటెద్దు పోకడలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థులంతా ఓ వర్గంగా ఏర్పడి సర్పంచ్‌లపై ఎదురుదాడికి దిగుతున్నారు. దీనికి తోడు గ్రామ వీడీసీల తీర్మానాలు వివాదాలకు దారితీస్తున్నాయి. చిన్నచిన్న సమస్యలు పంచాయతీల్లోనే పరిష్కరించుకునే అవకాశం ఉన్నా పంతం నెగ్గించుకునేందుకు అధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు. నేతల అండదండలతో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకుంటూ కక్షపూరిత వాతావరణానికి దారి తీస్తున్నారు.
అభివృద్ధికి అడ్డంకులు
మునుపెన్నడూ లేని విధంగా ఈసారి గ్రామపంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులను మంజూరు చేస్తున్నాయి. ఆ నిధులను సర్పంచ్, ఉపసర్పంచ్ సమ్మతితోనే అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాగా, వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో గ్రామప్రగతి గాడితప్పే అవకాశముంది. సకాలంలో నిధులు ఖర్చు చేయక అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు. దీనికి తోడు అధికారుల ఒత్తిడి పెరిగిపోయి సర్పంచ్‌లు సతమతమవుతున్నారు. ఎన్నికల్లో హామీలిచ్చి అభివృద్ధి పనులు చేయకుంటే ప్రజలు ప్రశ్నించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.


