బతుకమ్మ చీరలెక్కడ? | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ చీరలెక్కడ?

Sep 18 2026 1:57 AM | Updated on Sep 18 2026 1:57 AM

బతుకమ్మ చీరలెక్కడ?

నగరపాలక సంస్థలో బతుకమ్మ చీరల వివరాలు

ఆన్‌లైన్‌లో చూపించడం లేదు

నగరంలో పంపిణీ కాని

చీరలు 83 వేలు

మళ్లీ బతుకమ్మ వస్తున్నా చలనం లేని బల్దియా

గత బతుకమ్మ చీరలే

పంపిణీ కాని దుస్థితి

మొత్తం బతుకమ్మ చీరలు 1,18,576

స్వయం సహాయక సంఘాలు: 5,411

సభ్యులు: 55,129

బతుకమ్మ చీరల పంపిణీ: 28 వేలు

పెండింగ్‌లో ఉన్న సభ్యులు: 27,129

(18 ఏళ్లు నిండి తెల్లరేషన్‌కార్డు ఉన్న

మహిళలు, యువతులు: 6,955

ఇంకా ఇవ్వాల్సిన చీరలు : 83,621?)

కరీంనగర్‌కార్పొరేషన్‌: పేరుగొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా మారింది నగరపాలకసంస్థ అధికారుల తీరు. మళ్లీ బతుకమ్మ పండుగ వస్తున్నా, గతేడాది బతుకమ్మ చీరలు ఇప్పటికీ పంపిణీ చేయలేని దురావస్థలో బల్దియా ఉంది. లక్షా 18 వేల చీరలు నగరానికి వస్తే, ఇప్పటివరకు కేవలం 34 వేల చీరలు మాత్రమే పంపిణీ చేశారు. ఆ తర్వాత చీరల ఊసే మరిచిపోయారు. అసలు మిగిలిన 84 వేల చీరలు ఎక్కడున్నాయో కూడా తెలియని పరిస్థితి.

మే నెలలో పంపిణీ

తెలంగాణలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ బతుకమ్మకు ప్రభుత్వం చీరలు అందిస్తుండడం తెలిసిందే. గత ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని, ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింది. గతేడాది (2025) బతుకమ్మ పండుగకు చీరలు పంపిణీ చేసినా, స్వశక్తి సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకే ముందుగా ఇస్తామని ప్రకటించింది. తర్వాత 18 ఏళ్లు నిండిన తెల్లరేషన్‌కార్డు ఉన్న యువతులు, మహిళలకు అందజేయాలని నిర్ణయించింది. గ్రామాల్లో ముందుగానే చీరలు పంపిణీ చేసినా, నగరపాలకసంస్థ పరిధిలో మాత్రం ఈ ఏడాది మే నెలలో చీరలు పంపిణీ చేశారు.

నగరానికి లక్షా 18 వేల చీరలు

ప్రతిసారి బతుకమ్మ పండుగకు ముందు చీరలు పంపిణీ చేయడం ఆనవాయితీ అయినా గతేడాది బతుకమ్మ చీరలు మాత్రం బతుకమ్మ పండుగ తర్వాత పంపిణీకి నోచుకున్నాయి. నగరపాలకసంస్థకు 1,18,576 చీరలు వచ్చాయి. స్వశక్తి మహిళా సంఘాల సభ్యులతో పాటు, అర్హులైన 18 ఏళ్లు నిండినవారికి పంపిణీ చేశారు. అయితే నగరంలో మొత్తం స్వశక్తి సంఘాల మహిళలు 55,129 మంది ఉండగా, కేవలం 28 వేల మందికి మాత్రమే చీరలు పంపిణీ చేశారు. మిగతా 27,129 మందికి ఇప్పటివరకు చీరలు అందలేదు. ఇక స్వశక్తి మహిళలు కాకుండా కేవలం 6,955 మందికి మాత్రమే చీరలు అందించారు. మొత్తంగా చూస్తే 34,955 చీరలు పంపిణి చేయగా, 83,621? చీరలు పంచాల్సి ఉంది. మిగిలిన 83,621 చీరలు ఎక్కడున్నాయో తెలియని పరిస్థితి. మరో నెల రోజుల్లో మళ్లీ బతుకమ్మ పండుగ వస్తున్నా, గతేడాది బతుకమ్మ చీరల పంపిణీ ఇప్పటికీ నోచుకోకపోవడం అధికారుల పనితీరును తెలియజేస్తోంది.

బతుకమ్మ చీరలు నగరంలో దాదాపు 70 వేలు పంపిణీ చేశాం. ఇంకా చీరలు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే 70 వేల చీరలు ఇచ్చినా, ఆన్‌లైన్‌లో చూపించడం లేదు. లబ్ధిదారుల ఆధారాలు తీసుకునే సమయంలో సాంకేతికంగా ఇబ్బంది ఎదురవుతోంది. అందుకే చీరలు ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నట్లు చూపుతోంది.

– మానస, టీఎంసీ, నగరపాలకసంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement