కరీంనగర్‌సిటీ: మానవ జీవితంలో చట్టాల ప్రాముఖ్యత, సాంకేతికత, వనరులను సరైన మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలో అవగాహన ఉండాలని డీఎస్‌ఎల్‌ఏ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్‌సింగ్ అన్నారు. గురువారం శాతవాహన విశ్వవిద్యాలయ న్యాయ కళాశాల సెమినార్ హాల్‌లో నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దని, సైబర్ నేరాలు, మత్తు పదార్థాలు, ర్యాగింగ్ వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం ప్రిన్సిపాల్ కె.పద్మావతి, వీసీ యు.ఉమేశ్‌కుమార్, రిజిస్ట్రార్ పి.సతీశ్‌కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సు లక్ష్యాలు, ఉద్దేశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. తరగతి గదుల్లో విజ్ఞానాన్ని నేర్చుకొని దేశాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. సైబర్‌క్రైం అధికారి మహేశ్, యాంటీ డ్రగ్స్ అధికారి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌క్రైం: తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ ప్రధాన కార్యాలయంలో గురువారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. సీపీవో కార్యాలయంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ జాతీయజెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం, చట్టబద్ధ పాలనతో పాటు సమాజంలో శాంతిభద్రతలను పరిరక్షించడం పోలీసు వ్యవస్థ ప్రథమ కర్తవ్యమన్నారు. పౌరులకు సత్వర న్యాయం అందేలా పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా ప నిచేయాలని సూచించారు. అదనపు డీసీపీలు, ఏసీపీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.
మండపాల పరిశీలన
రామడుగు: రామడుగు, చొప్పదండి మండలా ల్లో పలు వినాయక మండపాలను గురువారం సీపీ గౌస్ ఆలం, ఉత్తరప్రదేశ్‌కు చెందిన స్వామి జీ సంఘటిత్‌దాస్ పరిశీలించారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్‌కుమార్, చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
న్యాయం జరగకుంటే ఐదువేల మందితో ధర్నా
తిమ్మాపూర్: మండలంలోని మొగిలిపాలెం సర్పంచ్ తాట్ల తిరుపతిపై ఇటీవల జరిగిన దాడిని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ ఖండించారు. గురువారం సర్పంచ్‌ను పరామర్శించారు. ఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. గ్రామస్తుల మద్దతుతో గెలిచిన సర్పంచ్ తనకు నచ్చిన విధంగా గ్రామాభివృద్ధి చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కొంతమంది అడ్డుపడి దాడి చేయడం, అధికారాన్ని దుర్వినియోగం చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొసైటీ చైర్మన్ హోదాలో ఉన్న నిందితున్ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యాయం జరగకుంటే అవసరమైతే 5 వేల మందితో ధర్నా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అధైర్యపడవద్దని సర్పంచ్‌ను ఓదారుస్తూ, బీఆర్‌ఎస్ పార్టీతోపాటు ముదిరాజ్ సమాజం పూర్తి అండగా ఉంటుందన్నారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, బీఆర్‌ఎస్, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
21, 22వ తేదీల్లో క్యాంపులు
సప్తగిరికాలనీ(కరీంనగర్): దివ్యాంగ పిల్లల ఉపకరణాల గుర్తింపు కోసం పాఠశాల విద్యాశాఖ తరఫున ఈ నెల 21,22న అసెస్మెంట్ క్యాంపులు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాధికారి చైతన్య జైనీ తెలిపారు. 21న కరీంనగర్‌లోని భవిత కేంద్రం, 22న హుజురాబాద్ జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహిస్తామని పేర్కొన్నారు. 5 నుంచి 18 ఏళ్ల వయస్సు గల దివ్యాంగ పిల్లలు ఉపకరణాల గుర్తింపునకు అర్హులని, క్యాంపుకు వచ్చే వారు ఆధార్, తెల్ల రేషన్‌కార్డు, ఆదాయ ధ్రువీకరణ, సదరం సర్టిఫికెట్లతో రావాలని తెలిపారు.


