ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధి పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామంలో అప్పల రాజయ్య(55) వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రాజయ్య బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి పొలం వద్దకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు గ్రామ పరిసర ప్రాంతాల్లో వెతకగా గురువారం గుంటూరుపల్లి గ్రామ శివారులో పొలంలో వడదెబ్బతో మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి భార్య అప్పల కొమురమ్మ ఎల్కలపల్లి గ్రామ వార్డు సభ్యురాలు. కొడుకు అనిల్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్ తెలిపారు.
జీడీనగర్‌లో వృద్ధుడు..
పాలకుర్తి(రామగుండం): మండలంలోని జీడీనగర్ గ్రామానికి చెందిన గండికోట మల్లయ్య(82) గురువారం వడదెబ్బతో మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాలు.. తీవ్ర ఎండల ధాటికి అస్వస్థతకు గురైన మల్లయ్య అపస్మారక స్థితికి వెళ్లడంతో కుటుంబసభ్యులు పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.


