కరీంనగర్ క్రైం: నగరంలోని సప్తగిరికాలనీకి చెందిన ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని మృతి చెందాడు. కరీంనగర్ టూ టౌన్ పోలీసుల కథనం ప్రకారం.. సప్తగిరికాలనీకి చెందిన తులసి సురేశ్(36) మంకమ్మతోటలో పాత లేబర్ అడ్డా వద్ద ఆన్‌లైన్ సర్వీసెస్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఇంటికి వెళ్లి భోజనం చేసి సెంటర్‌కు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి రాకపోవడంతో సురేశ్ తల్లి భాగ్యమ్మ పలుమార్లు ఫోన్ చేసింది. అతని బంధువులు, స్నేహితులకు కూడా ఫోన్ చేసినా సురేశ్ లిఫ్ట్ చేయలేదు. రాత్రంతా ఫోన్ తీయకపోవడంతో గురువారం వేకువజామున సురేశ్ సోదరి లక్ష్మి అతని స్నేహితుడికి ఫోన్ చేసి షాప్ వద్దకు వెళ్లి చూడమని చెప్పింది. అతను వెళ్లి స్థానికుల సాయంతో షట్టర్ తీసి చూడగా.. లోపల ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెంది ఉన్నాడు. వెంటనే అతని కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వెళ్లగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సురేశ్ మృతిపై అనుమానం ఉందని తల్లి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. సురేశ్ మృతికి వ్యక్తిగత కారణాలు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ, ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది.


