హత్యా.. ఆత్మహత్యా? | - | Sakshi
Sakshi News home page

హత్యా.. ఆత్మహత్యా?

May 25 2026 12:17 AM | Updated on May 26 2026 10:05 AM

-

అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి

కరీంనగర్‌, మానకొండూర్‌: డబ్బు తీసుకొని వెళ్లిన యువకుడు విగతజీవిగా కనిపించిన ఘటన తిమ్మాపూర్‌ మండలం రామకృష్ణకాలనీ శివారులోని మానేరు డ్యాం సమీపంలో జరిగింది. పోలీసులు, మృతుడి తల్లి కథనం ప్రకారం.. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధి సదాశివపల్లికి చెందిన జార్తి కనకలక్ష్మి భర్త సంపత్‌ గతంలో చనిపోయాడు.

కనకలక్ష్మి వ్యవసాయ కూలీ పనులు చేస్తూ కొడుకు శ్రీనిధ్‌, కూతురును చదివిస్తోంది. శ్రీనిధ్‌ ఇటీవలే ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ పూర్తి చేశాడు. శనివారం ఉదయం 11 గంటలకు ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత ఇంట్లో దాచిన రూ.48,000 కనిపించలేదు.

అలాగే తన తల్లి మొబైల్‌ నుంచి శ్రీనిధ్‌ తన అకౌంట్‌కు రూ.33 వేలు బదిలీ చేసుకున్నట్లు తెలిసింది. మధ్యాహ్నం నుంచి ఫోన్‌ చేసినా ఎత్తలేదు. సాయంత్రం స్విచ్చాఫ్‌ అయింది. రాత్రి 10.30 గంటలకు శ్రీనిధ్‌ స్నేహితుడు వికాస్‌ ఫోన్‌ చేసి అతని గురించి అడిగాడు. స్నేహితులను విచారించగా వారు కూడా చూడలేదని చెప్పారు.

ఆదివారం శవమై..
ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో శ్రీనిధ్‌ స్నేహితులు వీక్‌, ప్రణయ్‌ ఇంటికి వచ్చి అతని గురించి అడిగి వెళ్లారు. ఉదయం 7 గంటల సమయంలో బంధువు కౌటం సంపత్‌, కనకలక్ష్మికి ఫోన్‌ చేసి రామకృష్ణకాలనీ శివారులో శ్రీనిధ్‌ ఉరేసుకున్నట్లు ఉందని తెలిపా డు.

బంధువులు ఘటన స్థలానికి చేరుకున్నారు. శ్రీనిధ్‌ చేతులు అదే తాడుతో కట్టి ఉన్నాయి. ఇది ఆత్మహత్య కాదని, హత్య చేసి ఉరివేసి ఉంటారని తల్లి అనుమానం వ్యక్తం చేసింది. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎల్‌ఎండీ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement