మండుటెండల్లో పండుటాకుల ఇక్కట్లు
ఎక్కడ, ఎప్పుడు అనేది తెలియక తిప్పలు
సమయం, వేదికలు పాటించని వార్డు అధికారులు
ప్రణాళిక లేని ప్రక్రియతో నగరంలో గందరగోళం
ఎండలు మండుతున్నాయి..పగటిపూట బయటకు రావొద్దంటూ ఓ వైపు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుండగా, మరో వైపు అదే సమయంలో.. మీరు బతికున్నట్లు నిర్ధారించుకొనేందుకు రోడ్లపైకి రండి. గంటల తరబడి ఎండలో వేచి ఉండైనా లైవ్ అథెంటికేషన్ చేసుకొని వెళ్లండి.. అంటూ నగరపాలకసంస్థ అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శల పాలవుతోంది.
‘నగరంలోని 56వ డివిజన్ పరిధిలో శనివారం ఉదయం ఆసరా పింఛన్‌దారులు లైవ్ అథెంటికేషన్ చేయించుకునేందుకు బోయవాడలోని ఫార్‌ూచ్యన్ మాల్‌కు చేరుకున్నారు. ఉదయం 10.30 గంటల వరకు సంబంధిత వార్డు అధికారి అక్కడకు రాలేదు. వచ్చాక నెట్‌వర్క్ పనిచేయడం లేదంటూ గుర్తింపు తీసుకోకపోవడంతో గంటల తరబడి వేచి ఉన్న దాదాపు 60 మంది వృద్ధులు ఊసురుమంటూ ఇంటి దారిపట్టారు’.
‘కిసాన్‌నగర్‌లో ఓ దివ్యాంగ మహిళ తన గుర్తింపు కోసం నగరపాలకసంస్థ నిర్వహించిన శిబిరానికి వచ్చింది. పింఛన్ జాబితాలో పేరే లేదని, సామాజిక తనిఖీలో పోయి ఉంటుందని సంబంధిత అధికారి చెప్పడంతో ఆ మహిళ ఖంగుతింది. ఆందోళనకు గురై డీఆర్‌డీవో కార్యాలయానికి వెళ్లగా, ఆమె పింఛన్‌ను ఎవరూ తొలగించలేదని తేలింది. చివరకు నగరపాలకసంస్థ కార్యాలయంలో గుర్తింపు వివరాలు నమోదుచేసుకుంది.’
‘చేయూత పెన్షన్ లబ్ధిదారులకు ముఖ్యమనవి. మీ ఆధార్ కార్డు తీసుకొని వెళ్లి, వేలిముద్రలు, కళ్లు, ముఖకవళికలు అప్‌డేట్ చేసుకోండి. సమయం ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు.’
– ఇది నగరంలోని వార్డు అధికారులు చేపడుతున్న లైవ్ అథెంటికేషన్‌కు సంబంధించిన సందేశం.
‘మీ ప్రాంతంలో తీవ్ర ఎండలున్నాయి. వేడిగాలులు వీచే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లవద్దు. ఇండ్లల్లోనే ఉండండి.’
– ఇది కరీంనగర్ నివాసితుల మొబైల్స్‌కు వేసవి తీవ్రత దృష్ట్యా టీజీఐసీసీసీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం
శనివారం చేసిన హెచ్చరికల సందేశం.
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థ పరిధిలో చేయూత పింఛన్‌దారుల లైవ్ అథెంటికేషన్ ప్రహసనంగా సాగుతోంది. వివరాలు నమోదు చేసే బాధ్యతను ఆయా డివిజన్ల వార్డు అధికారులకు అప్పగించారు. సదరు పింఛన్‌దారు ఆధార్‌కార్డుతో పాటు, వేలిముద్రలు, ముఖకవళికలు నమోదు చేసి లైవ్ అథెంటికేషన్‌ను పూర్తి చేస్తున్నారు. ఎక్కువ డివిజన్లలో ఎప్పుడు, ఎక్కడ గుర్తింపు నమోదు చేసుకుంటారనే అంశాలపై స్పష్టత లేకుండా పోయింది. కొన్ని డివిజన్లలో రోజుకో చోటికి శిబిరాలను మా ర్చుతుండడంతో, వృద్ధులు, వికలాంగులు నాయకుల ఇండ్ల చుట్టూ తిరుగుతున్నారు. మరికొన్ని చోట్ల కార్పొరేటర్ల ఇండ్లు, కార్యాలయాల్లో శిబిరాలు ఏర్పాటు చేయడం రాజకీయ విమర్శలకు దారితీస్తోంది. కార్పొరేటర్ల ఇండ్లకు అందరూ వెళ్లలేరని, అధికారులు ఎలా నిర్వహిస్తారంటూ ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల రాజకీయ కారణాలతో పింఛన్లు తొలగించేందుకు ఈ గుర్తింపును వినియోగించుకుంటున్నట్లు మాజీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా ఉన్నతాధికారులు దృష్టిసారించి నిర్ణీత సమయవేళలు, వేదికలను పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా చేయూత పింఛన్ దారుల లైవ్ అథెంటిఫికేషన్‌ను పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


