ఇంధన భారం రూ.8.60కోట్లు | - | Sakshi
Sakshi News home page

ఇంధన భారం రూ.8.60కోట్లు

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

● పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో సామాన్యులపై ప్రభావం ● ఇప్పటికే వంటగ్యాస్‌ పెంపు.. ఆందోళనలో సకలవర్గాలు

కరీంనగర్‌ అర్బన్‌: గ్యాస్‌ ధర గుదిబండగా మారగా, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు గుబులు రేపుతున్నా యి. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో కేంద్రం ధరలు పెంచడంతో సామాన్యుడి బడ్జెట్‌ అందనంత ఎత్తుకు చేరుతోంది. పెరిగిన ఇంధన ధరలతో జిల్లా వినియోగదారులపై నెలకు రూ.8.60కోట్ల భారం పడుతోంది.

వాహనమెక్కాలంటే తడుముకోవాల్సిందే

పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి. పెట్రోల్‌ లీటరుకు రూ.107.55 ఉండగా శుక్రవారం పెరిగిన ధరతో 110.97కు చేరింది. డీజిల్‌ లీటరు ధర రూ.95.78 నుంచి రూ.99.06కు చేరింది. దీంతో లక్షల వాహనాలకు ఇంధన భారం తడిసిమోపెడవుతోంది. ఎనిమిదేళ్ల క్రితం లీటరు పెట్రోల్‌ ధర రూ.55 ఉండగా ఏటేటా పెరుగుతుండటం ఆందోళనకర పరిణామం.

నెలకు రూ.8.60 కోట్ల భారం

పెట్రోల్‌, డీజిల్‌ ధరల మోతతో జిల్లాపై నెలకు రూ.8.60కోట్ల భారం పడుతోంది. జిల్లాలో 83 పెట్రోల్‌ బంకులుండగా 5లక్షల ద్విచక్ర వాహనాలు, 2లక్షల మూడు, నాలుగు చక్రాల వాహనాలున్నాయని సమాచారం. రోజుకు 3.60లక్షల లీటర్లు పెట్రోల్‌ వినియోగమవుతుండగా నిత్యం రూ.10.80లక్షల భారం పడుతుండగా నెలకు రూ.3.24కోట్ల భారం పడుతోంది. నిత్యం డీజిల్‌ వినియోగం 6లక్షల లీటర్లు కాగా రూ.18లక్షల భారం పడుతుండగా నెలకు రూ.5.40కోట్ల భారం పడుతోంది. రెండూ కలిపి నెలకు మొత్తంగా రూ.8.60 కోట్ల భారం పడుతోంది.

అన్ని వర్గాలపై ప్రభావం

జిల్లాలో వరి కోతలు సాగుతుండగా ఽట్రాక్టర్లు, లారీల ద్వారా ధాన్యం రవాణా చేస్తుండగా రైతులకు అదనపు భారం పడుతోంది. కూరగాయలతో పాటు వాణిజ్యరంగాలపై భారమే. మరో పక్షం రోజులైతే వానాకాలం సాగు ప్రారంభం కానుండగా దుక్కులు దున్నడం, నారుమళ్లు దున్నడం, ఎరువు రవాణా వంటి వాటిపై అదనపు వ్యయం తప్పదంటున్నారు అన్నదాతలు. ఇప్పటికే పప్పులు, నూనెల ధరలు పెరగగా మరింత పెరిగే అవకాశఽముందని వ్యాపారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

పెట్రోల్‌ బంకులు: 83

ద్విచక్ర వాహనాలు: 5లక్షలు

మూడు, నాలుగు చక్రాల వాహనాలు:

2లక్షలు

రోజుకు పెట్రోల్‌ వినియోగం:

3.60లక్షల లీటర్లు

డీజిల్‌ వాడకం: 6లక్షల లీటర్లు

పెరిగిన ధరతో

లీటర్‌ పెట్రోల్‌ రూ.110.97

డీజిల్‌ రూ.99.06

జిల్లాలో ఇంధన విక్రయాలు

Advertisement
 
Advertisement
Advertisement