యూసీఎఫ్‌ ప్రతిపాదనలు తనిఖీ | - | Sakshi
Sakshi News home page

యూసీఎఫ్‌ ప్రతిపాదనలు తనిఖీ

May 18 2026 6:45 AM | Updated on May 18 2026 6:45 AM

● ముగిసిన కేంద్ర అధికారి పర్యటన ● ఎంపికై తే నగరానికి రూ.895 కోట్లు ● వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం

కరీంనగర్‌ కార్పొరేషన్‌: అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌)లో కరీంనగర్‌ నగరపాలకసంస్థను చేర్చే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వ అధికారి చేపట్టిన నగర పర్యటన ఆదివారంతో ముగిసింది. శని, ఆదివారాల్లో రెండు రోజుల పాటు నగరంలోని యూసీఎఫ్‌ ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. నగరపాలకసంస్థ సర్వసభ్యసమావేశం రూపొందించిన మూడుప్రాజెక్ట్‌లకు సంబంధించిన రూ.895 కోట్ల ప్రతిపాదనలను స్వయంగా పరిశీలించారు. వీటిపై కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖకు నివేదిక అందించనున్నారు. ఈ నివేదిక ఆధారంగా యూసీఎఫ్‌లో కరీంనగర్‌ను చేర్చే అంశాన్ని మంత్రిత్వశాఖ వెల్లడించనుంది.

రెండో రోజు పర్యటన

యూసీఎఫ్‌ ప్రతిపాదనలను ఫీల్డ్‌ లెవెల్‌లో పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారి దీపు టాం కరీంనగర్‌కు వచ్చారు. శనివారం రాత్రి నగరానికి వచ్చిన ఆయనకు మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, కమిషనర్‌ ప్రపుల్‌దేశాయ్‌ స్వాగతం పలికారు. మొదటి రోజు డంప్‌యర్డ్‌తో పాటు, అధికారులతో చర్చించి, ఆదివారం రేకుర్తి, తీగులగుట్టపల్లి, ఆరెపల్లి, సీతారాంపూర్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. డంప్‌యార్డ్‌తో పాటు, బల్దియా కౌన్సిల్‌ ప్రతిపాదించిన మూడు ప్రాజెక్ట్‌ల ప్రతిపాదనల వివరాలు తెలుసుకున్నారు. రోడ్లు, నాలాలను పరిశీలించి అధికారుల నుంచి వివరాలు ఆరా తీశారు. స్కైవాక్‌, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, మోడల్‌ రోడ్స్‌, మోడల్‌ జంక్షన్‌ తదితర ప్రతిపాదిత సైట్‌లు తనిఖీ చేసి తిరిగి ఢిల్లీకి వెళ్లారు.

వారం లోగా స్పష్టత

దేశవ్యాప్తంగా నగరాల్లో అమలు చేయనున్న అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు కేటాయించింది. పథకంలో చేరిన నగరాలకు నేరుగా 25శాతం వాటాను విడుదల చేస్తుంది. మిగతా 25శాతం రాష్ట్ర ప్రభుత్వం, నగరపాలకసంస్థ భరించాల్సి ఉంటుంది. 50 శాతం బ్యాంక్‌ రుణాలు, బాండ్ల విక్రయం, పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్యం తదితర మార్గాల ద్వారా సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఈ పథకంలో నగరపాలక సంస్థ అధిక భారాన్ని మోయాల్సి ఉన్నప్పటికీ పథకంలో ఎంపికై తే నగరం రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయి. ఇప్పటికే కేంద్ర హోం శాఖసహాయ మంత్రి బండి సంజయ్‌ యూసీఎఫ్‌ స్కీంలో కరీంనగర్‌ను చేర్చేందుకు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. ఈ క్రమంలోనే కరీంనగర్‌ను యూసీఎఫ్‌లో చేర్చేందుకు సూత్రప్రాయ ఆమోదం లభించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వ అధికారి రెండు రోజుల పాటు నగరంలో క్షేత్రస్థాయి తనిఖీచేసి వెళ్లారు. ప్రక్రియ పూర్తయినందున మరోవారం రోజుల్లో యూసీఎఫ్‌ పథకంలో కరీంనగర్‌ను చేర్చడంపై స్పష్టత వచ్చే అవకాశముంది. ఒకవేళ స్కీంలో కరీంనగర్‌ను ఎంపిక చేస్తే స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌ తరువాత ఆ స్థాయిలో నిధులతో నగరం స్వరూపం మారనుంది.

Advertisement
 
Advertisement
Advertisement