కరీంనగర్ కార్పొరేషన్: మెరుగైన విధానాలు, నాణ్యతతో కూడిన వ్యాపారాలతో వీధి వ్యాపారులు అభివృద్ధి సాధిస్తారని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) ప్రాజెక్ట్ డైరెక్టర్ స్వరూపరాణి అన్నారు. మంగళవారం కళాభారతిలో వీధి వ్యాపారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వయం ఉపాధి, పట్టణ జీవనోపాధిని ప్రోత్సహించడంలో వీధి వ్యాపారులు, స్వయం సహాయక బృందాల పారిశ్రామికవేత్తల కృషి అభినందనీయమన్నారు. పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు, వ్యాపార నిర్వహణ, వినియోగదారుల సేవ, స్వయం ఉపాధి కార్యకలాపాల ద్వారా జీవనోపాధిని బలోపేతం చేసుకునే అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం సర్టిఫికెట్లు అందజేశారు. నగరపాలకసంస్థ డిప్యూటీ కమిషనర్ వేణు మాధవ్, మెప్మా ఇన్‌చార్జీ డీఎంసీ మల్లీశ్వరి, టీఎంసీ మానస, సీఓలు పద్మ, స్వప్న, తిరుపతి, మంజుల, దీప తదితరులు పాల్గొన్నారు.


