పాత ఆటలు... భలే సరదాలు | - | Sakshi
Sakshi News home page

పాత ఆటలు... భలే సరదాలు

May 13 2026 2:08 AM | Updated on May 13 2026 2:08 AM

పేరు–ఊరు తాడాట

వేసవి సెలవులు వచ్చేశాయి. పాఠశాలలున్న రోజుల్లోనే పిల్లలు ఫోన్లు వదలడం లేదు. ఇక సెలవుల్లో మన మాట వింటారా? ఆ ఫోన్లకే అతుక్కుపోతారు అంటూ తల్లిదండ్రులు బాధపడొద్దు. మీరు కూడా ఖాళీ సమయం చూసుకుని పిల్లలతో ఈ పాత ఆటలు

ఆడించండి. మీరు చిన్నతనంలో ఆడుకునే ఉంటారు. వారూ వాటిని వదిలి పెట్టరు.

గడులాట: క్లాసురూంలో ఖాళీ పీరియడ్‌ వచ్చిందంటే చాలు నోట్‌ పుస్తకాలు తీసుకొని దానిలో గడులాట ఆడేవారు. ఒకరు ఒక గీత గీయాలి. వేరొకరు దానికి ఆనించి మరో గీతగీయాలి. ఇలా నాలుగు గీతలు గీస్తే ఒక గడిలా తయారవుతుంది. చివరి గీత ఎవరు గీస్తే గడిలా తయారవుతుందో వారిదే ఆ గడి అన్నమాట. ఆ గడిలో వారి పేరు మొదటి అక్షరం రాసుకుంటారు. అలా పేజీ అంతా అయ్యాక లెక్కిస్తే ఎవరికి ఎక్కువ గడులొస్తే వారు గెలిచినట్టు.

చిట్ల పొట్లకాయ ఆట: ఇది దాదాపు దాగుడుమూతల్లానే ఉంటుంది. ఒక మూలవైపుగా ఒకమ్మాయిని కూర్చోమంటారు. మిగిలిన వాళ్ళలో ఒకరు వెళ్ళి కూర్చున్న అమ్మాయి కళ్ళు మూస్తారు. అప్పుడు ఎవరు కళ్ళు మూశారో చెప్పాలి. కళ్ళు మూసిన అమ్మాయి పేరు కనుక్కుంటే ఆ అమ్మాయిని కూర్చోబెట్టి మరల ఆడతారు. పేరు కనుక్కోలేకపోతే మొదట అమ్మాయికే కళ్లు మూయాలి.

చిట్ల పొట్లకాయ–సీమనెల్లి కాయ

గోడ పుచ్చకాయ–గొట్టినెల్లి కాయ

అత్తకు పెడితే అల్లం–అల్లుడు తింటే బెల్లం

కొత్త కుండల్లోని కోడళ్లారా–పాలపిడతలోని పాపల్లారా!

అంటూ ఈ ఆట ఆడుతూ పాట పాడతారు.

ఇప్పటి పిల్లలు అంత్యాక్షరి ఆడుకున్నట్లుగా మా కాలంలో ఈ ఆట ఆడేవారు. ఆటలో పాల్గొనే వాళ్లంతా తలా ఒక పుస్తకం, పెన్నుతీసుకొని ఒక పేజీలో పేరు, ఊరు అని పైన రాస్తారు. ఆ తర్వాత ఎవరో ఒక్కరు ఒక అక్షరం పేరు చెబుతారు. ఆ అక్షరంతో వచ్చే పేరు, ఊరు పేరు రాయాలి. ఎదుటి వాళ్లకు రాని విధంగా ఉండేలా కష్టమైన అక్షరాలు ఇస్తారు. దానికి వాళ్లు పేరు, ఊరు పేరు రాయాలి. ఇప్పటిలా దీవీలు లేవు కాబట్టి. ఊర్ల పేర్లు చాలామందికి తెలియవు. అట్లాస్లో చూడటమే తప్ప విడిగా తెలియదు. అప్పట్లో మేము ఎవ్వరికీ తెలియని వికారాబాద్‌ పేరును తెగ రాసేవాళ్లం. ఇలా ఎవరికీ తెలియనివి రాసినపుడు పక్క ఫ్రెండ్స్‌ ఒప్పుకునే వాళ్లు కాదు. ఇంకా కొంత మంది ఊరు, పేరుతో పాటు ఆట, పండు, తినే వస్తువు అని ఇలా నచ్చినట్టుగా పెట్టుకునే వాళ్లు.. ఎన్ని గంటలైనా ఆడుకునే వాళ్లం.

ఆడపిల్లలకు చాలా ఇష్టమైన ఆటఇది. ఒక తాడును తీసుకొని ఎగరేస్తూ రెండు కాళ్లకింద నుంచి తీసుకెళ్తారు. ఎగురుతూ ఆడే ఈ ఆట వ్యాయామానికీ ఉపయోగ పడుతుంది. పిల్లలుగా ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉంటుందో, పెద్ద వాళ్లయ్యాక కూడా అంతే సరదాగా ఆడుకోవచ్చు. ఒంటి కాలితో, రెండు కాళ్లతో ఆడే స్కిప్పింగ్‌ ఎక్కడా తడబడకుండా వంద వరకూ ఆడేవాళ్లం అలుపు లేకుండా. ఈ రోజుల్లో ఇవేవీ లేవు.

రచన: డాక్టర్‌ కందేపి రాణీప్రసాద్‌, రాజన్నసిరిసిల్ల

Advertisement
 
Advertisement
Advertisement