కరీంనగర్: ఎండాకాలం వచ్చిందంటే కొన్ని రకాల వ్యాధులు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. మునుపెన్నడూ లేని విధంగా ఏప్రిల్‌లో పగటి ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎండలో బయటకు వెళ్లాలంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం 11 గంటల తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో వ్యాధులు కూడా అదే స్థాయిలో వ్యాపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధానాసుపత్రి, ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలలో రోగుల తాకిడి రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ ప్రధానాసుపత్రిలో రోజూ 1,200 నుంచి 1,500 వరకు ఓపీ నమోదవుతుంది. అయితే ఇన్‌పెషెంట్‌లు ఎక్కువగా ఉండడం లేదని వైద్యులు చెబుతున్నారు. ఓపీతోనే జ్వరాలు, ఇతర సీజనల్ వ్యాధులు తగ్గుతున్నాయని పేర్కొంటున్నారు. జాగ్రత్తలతోనే వ్యాధులు దూరమవుతాయని వెల్లడిస్తున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
వేసవిలో వచ్చే వ్యాధులపై ముందస్తు అప్రమత్తం అవసరం. వీటి నుంచి ఉపశమనం పొందడానికి నీటిని ఎక్కువగా తాగాలి. ఓఆర్‌ఎస్ ద్రావణం తీసుకోవాలి. అన్నిరకాల వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు అందుబాటులో ఉన్నాయి. ప్రజలు ఎండలో తిరగకుండా జాగ్రత్త పడితే మంచిది.– డాక్టర్ వెంకటరమణ, డీఎంహెచ్‌వో


