గంగాధర: కుల వివక్ష, రెండు గ్లాసుల పద్ధతులు, ఆలయాల్లోకి ప్రవేశ నిషేధం వంటివి గ్రామాల్లో ఉండకూడదని, అలా ప్రవరిస్తే చట్టరీత్యా నేరమవుతుందని అధికారులు గ్రామాల్లో పౌరహక్కుల దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నా ప్రజల్లో తీరు మారడం లేదు. కొన్ని కుటుంబాలను తమ కులం నుంచి బహిష్కరిస్తూ ఏకంగా సర్పంచు సమక్షంలో కుల పెద్దలు తీర్మానం చేసిన ఘటన నాలుగురోజుల క్రితం జరుగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన బాధితుడు గజ్జెల సురేశ్ తెలిపిన వివరాలు.. మల్లాపూర్‌లో ఎస్సీ కులానికి చెందిన గజ్జెల, సింగారపు, మహంకాళి, చిలుముల, నాగని, మచ్చ అనే ఇంటి పేర్లతో ముప్‌పై కుటుంబాలు ఉంటాయి. గ్రామంలో వీరిని చిన్నమాదిగలు అంటారు. ఇదే గ్రామంలో కొలెపాక ఇంటి పేరు గల (పెద్దమాదిగ) వారు ఉన్నారు. కొన్నేళ్లుగా చిన్నమాదిగలను కొలెపాక వారు చిన్నచూపు చూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గజ్జెల సురేశ్ కొలెపాక కుటుంబాల వారిని తిట్టాడని తప్పుడు ప్రచారం చేసి పంచాయితీకి పిలవగా సదరు వ్యక్తి వెళ్లలేదు. దీంతో పంచాయితీ పెద్దలు సమావేశమై కొలెపాక కుటుంబాల వారు ఇతరుల (చిన్న మాదిగల) శుభ, అశుభ కార్యాలకు వెళ్లకూడదని, ఎవరైనా వెళ్తే వారిని కూడా కులం నుంచి దూరం పెడుతామని తీర్మానం చేశారు. తమపై వివక్ష చూపుతున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు సురేశ్ పేర్కొన్నాడు.


