కరీంనగర్: జిల్లాలో వేసవికాలంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు, అధికారులు, మిషన్ భగీరథ, రూరల్ వాటర్ సప్లయ్ విభాగం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రామిశ్రా మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి సరఫరాకు సంబంధించిన రిజర్వాయర్లలో నీటిమట్టం తగ్గకుండా పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. మిషన్ భగీరథ నీరు ప్రతి ఇంటికి సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మి కిరణ్, ఆర్డీవోలు కే.మహేశ్వర్, రమేశ్‌బాబు ఉన్నారు.
పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక
నిరుద్యోగ దళితులకు సబ్సిడీ రుణాలను పారదర్శకంగా అందించాలని కలెక్టర్ చిత్రామిశ్రా ఆదేశించారు. శనివారం కలెక్టర్ చాంబర్‌లో కలెక్టర్ అధ్యక్షతన 2025 –26 ఆర్థిక సంవత్సరం ఎస్సీ యాక్షన్ ప్లాన్ అమలుకు జిల్లాస్థాయి కమిటీ ఆమోదం తెలి పింది. సబ్సిడీ రుణాల పంపిణీ లబ్ధిదారుల ఎంపిక అంశాలపై కలెక్టర్ చర్చించారు. ఈవీ టూ వీలర్స్ 169 వాహనాలు 90శాతం సబ్సిడీ, 83 త్రీ వీలర్స్ వాహనాలు 70శాతం సబ్సిడీ, 18 సబ్సిడీ సోలార్ యూనిట్ పంపు కంట్రోల్ యూనిట్స్ 100శాతం సబ్సిడీ కింద జిల్లాకు కేటాయించారని పేర్కొన్నారు. ఈనెల 8వ తేదీ లోపు నిరుద్యోగ దళితులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న ధ్రువపత్రాలను ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల్లో అందించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఇన్‌చార్జి ఈడీ తిరుపతిరావు, పరిశ్రమలశాఖ జీఎం సాల్మాన్ రాజు పాల్గొన్నారు.


