నోరూరేనంట.. యాదమ్మ వంట | - | Sakshi
Sakshi News home page

నోరూరేనంట.. యాదమ్మ వంట

Apr 5 2026 8:36 AM | Updated on Apr 5 2026 8:36 AM

మోదీ మెచ్చిన వంటలు

వందలాది మందికి ఉపాధి

ఈ జన్మలో కలిగిన భాగ్యం

విద్యానగర్‌(కరీంనగర్‌): యాదమ్మది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం గౌరవెల్లి. చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన చంద్రయ్యతో పదిహేనేళ్ల వయసులోనే వివాహమైంది. కొడుకు పుట్టిన మూడు నెలలకే చంద్రయ్య ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో కొడుకును తీసుకుని కరీంనగర్‌కు వలసొచ్చారు. కొన్ని రోజులు స్కూల్‌లో ఆయాగా పని చేశారు. తరువాత మంకమ్మతోటకు చెందిన వెంకన్న వద్ద వంటపనిలో హెల్పర్‌గా చేరారు. అందుకు రోజూ రూ.15 కూలీ తీసుకునేవారు. కాలక్రమేణ చిన్నచిన్న ఫంక్షన్లలో వంటచేస్తూ మన్ననలు పొందారు. క్రమేనా పెద్దపెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 50 వేల మందికై నా ఒంటిచేత్తో వంటచేసేలా ప్రావీణ్యం సంపాదించారు.

2022లో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న వందలాది మంది ప్రముఖులకు యాదమ్మ తన చేతి వంటలు రుచి చూపించి శభాష్‌ అనిపించుకున్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హోటల్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వంటలు రుచిచూసిన ప్రధాని యాదమ్మను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం పలుమార్లు యాదమ్మ వంటలను మెచ్చుకున్నారు. కేటీఆర్‌ నిర్వహించిన మూడు బహిరంగసభలు, వేములవాడ శివరాత్రి ఉత్సవాలు, కొండగట్టు హనుమాన్‌ జయంతి, గోదావరి పుష్కరాల్లో వేలాది మందికి వంటలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్‌ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి కూతురు పెళ్లిలో 30వేల మందికి, కరీంనగర్‌ తీగల వంతెన ప్రారంభం అప్పుడు 20వేల మందికి వంటలు చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్‌, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నివాసాల్లో జరిగిన ఫంక్షన్లకూ యాదమ్మ క్యాటరింగ్‌ చేశారు. గతనెల 27న కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో 25వేల మందికి రుచికరమైన వంటకాలు చేసిపెట్టారు.

కిరాయి పెంకుటిళ్లు నుంచి ఇప్పుడు సప్తగిరికాలనీలో తనకంటూ ఒక మంచి సొంతిళ్లు నిర్మించుకుని దుర్గా నిలయంగా పేరు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును చదివించి రూ.12 లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపింపారు. అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలు కావడంతో స్వదేశానికి వచ్చి అతనూ క్యాటరింగ్‌ చేస్తున్నాడు. యాదమ్మ వద్ద దాదాపు 200 మంది వంటలు నేర్చుకుని సొంతంగా క్యాటరింగ్‌లు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్‌కు చెందిన 20 మంది మహిళలు వంటలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. సీజన్‌లో 200మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో నిత్యం 10 నుంచి 20 మంది యాదమ్మ వంటకు సాయంగా ఉంటారు.

కరీంనగర్‌లోని మారుమూల పల్లెలో పుట్టిన నేను ఈ దేశ ప్రధానికి నా చేతి వంట రుచి చూపిస్తానని కలలో కూడ అనుకోలేదు. శాకాహారమే కాకుండా నాన్‌ వెజ్‌ వంటకాలు కూడా బాగా చేస్తాను. గంగుల కమలాకర్‌, బండి సంజయ్‌లు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు, కాలేజీ ఫంక్షన్లకు, రాజకీయ సభలకు దాదాపు 20 నుంచి 30వేల మందికి వంట చేయగలను. నా వద్ద ప్రస్తుతం 40మంది వరకు పని చేస్తారు. నా దగ్గర పని నేర్చుకున్న వారు స్వయంగా క్యాటరింగ్‌ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను అమెరికా సైతం పంపించారు. – గూళ్ల యాదమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement