మల్యాల(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయంలో ఈనెల 1 నుంచి 3 వరకు నిర్వహించిన హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాల ద్వారా రూ.1.66కోట్ల ఆదాయం సమకూరినట్లు ఈవో అంజనారెడ్డి తెలిపారు. కేశ ఖండన ద్వారా రూ.11,48,000, లడ్డూ ప్రసాదం రూ.81,62,100, పులిహోర రూ.15,42,320, దీక్ష విమరణ రూ.39,77,500, శీఘ్ర దర్శనం ద్వారా రూ.18,58,400 మూడురోజుల ఉత్సవాల్లో మొత్తం రూ.1,66,88,320 ఆదాయం సమకూరిందని ఈవో పేర్కొన్నారు.
గంజాయి విక్రేతల అరెస్ట్
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణం మోతెరోడ్‌లో శనివారం ఉదయం గంజాయి విక్రయించేందుకు వచ్చిన ఇద్దరిని పట్టణ ఎస్సై సుప్రియ పట్టుకున్నారు. వారి నుంచి 250 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం కొప్పెర్ల గ్రామానికి చెందిన కొత్తూరి అఖిల్, దర్శనాల అభిలాష్ ఆదిలాబాద్ రైల్వేస్టేషన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తుల నుంచి గంజాయి కొనుగోలు చేసి కొండగట్టులో విక్రయించేందుకు వచ్చారు. కొండగట్టులో ఎవరూ కొనకపోవడంతో జగిత్యాలలోని మోతెరోడ్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఎస్సై పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
బద్దెనపల్లిలో వ్యక్తిపై దాడి
● అట్రాసిటీ కేసు విచారణ చేపట్టిన డీఎస్పీ
తంగళ్లపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన కోదాడి మల్లేశ్‌బాబుపై అదే గ్రామానికి చెందిన అభినయ్ దూషించి, భౌతిక దాడికి పాల్పడ్డాడు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా డీఎస్పీ కె.నాగేంద్రచారి శనివారం బద్దెనపల్లిలో విచారణ చేపట్టారు. వారి వాంగ్మూలాలను నమోదు చేసుకున్న డీఎస్పీ కేసులో పారదర్శకమైన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


