రాయికల్(జగిత్యాల): మండలంలోని అల్లీపూర్ గ్రామ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై సుధీర్‌రావు తెలిపిన వివరాలు.. జగిత్యాల మండలం లింగంపేట గ్రామానికి చెందిన సిరికొండ చంద్రశేఖర్ (25) శుక్రవారం ద్విచక్రవాహనంపై తన తల్లి గంగుతో కలిసి రాయికల్ మండలం తాట్లవాయి గ్రామంలోని సీతారాముల జాతరకు వెళ్లాడు. తర్వాత తల్లిని లింగంపేటలో దింపాడు. అనంతరం తన స్నేహితులు ఫోన్ చేయడంతో చంద్రశేఖర్ మళ్లీ వారితో కలిసి జాతరలో పాల్గొన్నాడు. రాత్రి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా అల్లీపూర్ శివారులో వేగంగా చెట్టును ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం చల్‌గల్ గ్రామానికి చెందిన బొల్లారం రాజం (67) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఎస్సై ఉమాసాగర్ తెలిపిన వివరాలు.. రాజం కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో మనస్తాపం చెంది గత నెల 30న సాయంత్రం పొలం వద్ద పురుగులమందు తాగగా కుటుంబ సభ్యులు గమనించి కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మళ్లీ జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి..
కరీంనగర్‌క్రైం: నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి పోలీస్ అవుట్ పోస్టు వెనకాల శనివారం మధ్యాహ్నం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. సుమారుగా వయసు 40 ఏళ్ల వయసు ఉంటుందని, బిచ్చగాడిగా ఆస్పత్రి పరిసరాల్లో తిరుగుతూ ఉండేవాడని తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ గదిలో భద్రపరిచినట్లు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే టూటౌన్ పోలీసులను సంప్రదించాలని సూచించారు.
వ్యక్తి అనుమానాస్పద..
కరీంనగర్‌క్రైం: ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు కరీంనగర్ టూటౌన్ పోలీసులు తెలిపారు. రామడుగు మండలం గోపాలరావుపేటకు చెందిన అలువాల రవి(48)కి 27 ఏళ్ల క్రితం లలితతో వివాహమైంది. ఇద్దరు కుమారులున్నారు. రెండేళ్ల క్రితం లలితతో గొడవపడి కరీంనగర్‌లోని రాంనగర్‌లో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటూ ఉల్లిగడ్డల వ్యాపారం చేస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి భార్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. శనివారం అతని భార్య ఫోన్ చేయగా, రూం పక్కన అద్దెకు ఉండే ఓ మహిళ ఎత్తింది. ఎంతపిలిచినా రవి కదలడం లేదని చెప్పింది. వెంటనే 108కు ఫోన్‌చేయగా వారు వచ్చి పరీక్షించి, మృతిచెందినట్లు తెలిపారు. శరీరంపై రక్తపు మరకలున్నాయని, రవి మృతిపై అనుమానం ఉందని లలిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ పోలీసులు తెలిపారు.


