కరీంనగర్‌రూరల్: కరీంనగర్ మండలం గుంటూరుపల్లి రాజీవ్ రహదారిపై శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కరీంనగర్‌రూరల్ సీఐ నిరంజన్‌రెడ్డి కథనం మేరకు మానకొండూరు మండలం అన్నారం గ్రామానికి చెందిన పోతర్ల అశోక్(31) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం వ్యక్తిగత పనినిమిత్తం పల్సర్ బైక్‌పై ఇరుకుల్లకు వచ్చాడు. రాత్రి 9గంటలకు కరీంనగర్‌కు బైక్‌పై వెళ్తుండగా గుంటూరుపల్లి రైల్వే అండర్‌బ్రిడ్జి సమీపంలో ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో వెంటనే చల్మెడ ఆనందరావు ఆస్పత్రికి తరలించగా వైద్యుల సలహామేరకు హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు పరీక్షించి మృతిచెందినట్లు నిర్ధారించడంతో శనివారం మృతదేహాన్ని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్ట్‌మార్టం నిర్వహించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు లారీడ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
గీతకార్మికుడికి గాయాలు
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మండలం మూలసాల గ్రామంలో తాటిచెట్టు పైకి ఎక్కి కల్లుగీస్తుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో బాలసాని రాజయ్య గాయాలపాలయ్యా డు. వెంటనే గమనించిన స్థానికులు పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిరుపేద అయిన రాజయ్యకు ప్రభుత్వపరంగా సాయమందించాలని సర్పంచ్ జూపాక శ్వేత, గీతకార్మికసంఘ నాయకులు కోరారు.
కిరీటం, నగలు మాయం
కోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లలోని శివసాయి ఆలయంలో సాయిబాబా కిరీటం, ఉత్సవ విగ్రహాల పుస్తెలు కని పించడం లేదు. భక్తులు సమర్పించిన ఈ కానుకలు కనిపించకపోవడంపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయంలోని నగలు అపహరణకు గురయ్యాయా, లేక ఎవరైనా భద్రపరిచారా అన్న విషయాలు తెలియాలని నవచైతన్య యూత్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
25 ఏళ్లుగా రోడ్లపైనే తిరిగి..
● కలెక్టర్ చొరవతో కుటుంబం చెంతకు..
కామారెడ్డిఅర్బన్: కామారెడ్డి పట్టణంలో రోడ్ల వెంట తిరుగుతున్న మానసిక వైకల్యం గల వ్యక్తి 25 ఏళ్ల తర్వాత తన కుటుంబాన్ని కలుసుకున్నాడు. పట్టణంలో గుర్తు తెలియని వ్యక్తి (50) మానసిక వైకల్యంతో రోడ్ల వెంబడి తిరుగుతున్న విషయం ఇటీవల కలెక్టర్ ఆశిష్‌సంగ్వాన్ దృష్టికి వచ్చింది. వెంటనే ఆయన స్పందించి జిల్లా సంక్షేమాధికారులను ఆదేశించడంతో శనివారం అతన్ని వృద్ధాశ్రమానికి తరలించి వైద్యసేవలు, ఆహారం అందించారు. తాను జగిత్యాల జిల్లాకు చెందిన వాడినని చెప్పడంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబసభ్యులు కామారెడ్డికి రాగా, అధికారులు అతడిని అప్పగించారు. 25ఏళ్ల తర్వాత తమ కుటుంబ సభ్యుడిని కలుసుకోవడం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు. కలెక్టర్, జిల్లా సంక్షేమాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. కాగా కలెక్టర్ ఆదేశం ప్రకారం మానసిక వైలక్యం వ్యక్తి వివరాలు, కుటుంబసభ్యుల వివరాలు గోప్యంగా ఉంచారు.
వాకిలి శుద్ధి చేస్తుండగా బావిలో పడ్డ మహిళ
ముత్తారం: పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఇప్పలపల్లి(రామకృష్ణాపూర్)కు చెందిన తూండ్ల సుమతి శనివారం ఉదయన వాకిలి శుద్ధి చేసే క్రమంలో కాలు జారి వ్యవసాయ బావిలో పడి తీవ్రగాయాలపాలైంది. బాధితురాలి కేకలు విన్న కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీశారు. 108 అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వగా టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, ఫైలెట్ హబీబ్ ప్రఽథమ చికిత్స అందించారు. ఆ తర్వాత మంథని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.


