ఇల్లందకుంట: ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన చంద్రరథం (పెద్దరథం) శుక్రవారం రాత్రి నుంచి శనివారం సాయంత్రం వరకు వైభవంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తజన సందోహం మధ్య రాములోరి రథోత్సవ వేడుక రమణీయంగా ముగిసింది. రామయ్య రథాన్ని వందలాది మంది తాళ్లతో లాగుతూ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రణవ్‌బాబు, యుప్‌టీవీ అధినేత పాడి ఉదయ్‌నందన్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వేడుకలో సుమారు 70వేల మంది పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు శేషం వంశీధరచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియ, ఇన్‌చార్జి ఈవో కందుల సుధాకర్, చైర్మన్ రామారావు పర్యవేక్షించారు. ఏసీపీ మాధవి, సీఐలు రామకృష్ణగౌడ్, లక్ష్మీనారాయణ, ఎస్సైలు క్రాంతికుమార్, ఆవుల తిరుపతి బందోబస్తు నిర్వహించారు.


