రోడ్డు ప్రమాదంలో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో రైతు మృతి

Apr 3 2026 7:20 AM | Updated on Apr 3 2026 7:20 AM

ఆటో బోల్తాపడి డ్రైవర్‌..

రామడుగు: కరీంనగర్‌ – జగిత్యాల జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామడుగు మండలం వెదిర గ్రామానికి చెందిన రైతు తొరికొండ నారాయణ(70) మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. నారాయణ తన సైకిల్‌పైన పంట పొలానికి నీళ్లు పెట్టడంకోసం రోడ్డు దాటుతున్నాడు. ఈక్రమంలో జగిత్యాల వైపు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొంది. తీవ్ర గాయాలపాలైన నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఎస్సై రాజు పరిశీలించారు. మృతదేహాన్ని కరీంనగర్‌ తరలించారు.

తిమ్మాపూర్‌లో ప్రమాదం సెంట్రింగ్‌ కూలీ..

తిమ్మాపూర్‌: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఎల్‌ఎండీ పోలీసుల కథనం ప్రకారం.. తిమ్మాపూర్‌ మండలంలోని ఇందిరానగర్‌ గ్రామానికి చెందిన కోదాటి మల్లేశం (51) అదే గ్రామానికి చెందిన దొంత శంకర్‌ సెంట్రింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం చిగురుమామిడి మండలం చిన్నమూల్కనూరు గ్రామంలో పని ముగించుకొని మధ్యాహ్నం తిరిగి ఇందిరానగర్‌ వస్తున్నారు. గ్రామ స్టేజీ వరకు చేరుకున్న వారి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వస్తున్న బొలేరో ఢీకొట్టింది. బైక్‌ నడుపుతున్న శంకర్‌, వెనుక కూర్చున్న మల్లేశంకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు క్షతగాత్రులను కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న మహల్లేశం బుధవారం రాత్రి మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అన్వర్‌ తెలిపారు.

జమ్మికుంట: మండలంలోని పెద్దంపల్లి గ్రామశివారులో గురువారం ఆటో బోల్తా పడిన సంఘటనలో డ్రైవర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. టౌన్‌ సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆటో నడపుకుంటూ జీవనం సాగిస్తున్న హుజూరాబాద్‌ మండలం పోతిరెడ్డిపేటకు చెందిన తేలుకుంట్ల శ్రీనివాస్‌ (37) గురువారం రోజువారి పనిలో భాగంగా వీణవంక మండలం నర్సింగాపూర్‌ నుంచి కూలీలను ఇల్లందకుంటలో దింపి స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈక్రమంలో పెద్దంపల్లి గ్రామశివారులో ఆటో అదుపుతప్పి బోల్తాపడగా అతనికి తల, ఛాతిపై తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్‌ సీఐ తెలిపారు.

జీజీహెచ్‌లో వ్యక్తి..

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో గురువారం గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. గోదావరిఖని అశోక్‌నగర్‌ ప్రాంతంలో రెండురోజులుగా ఉంటున్న ఓ గుర్తుతెలియని వ్యక్తిని స్థానికులు గుర్తించి 108 అంబులెన్స్‌ ద్వారా బుధవారం రాత్రి జీజీహెచ్‌కు తరలించారు. వైద్యులు పరీక్షించగా.. తలలో రక్తంగడ్డ(బ్లడ్‌ క్లాట్‌) ఏర్పడినట్లు గుర్తించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఐసీయూకు తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని గుర్తించిన వారు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement