కరీంనగర్: మహిళల ఆరోగ్య రక్షణకు ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య మహిళ క్యాంపునకు ప్రతీ మహిళ హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్‌వో డాక్టర్ వెంకటరమణ అన్నారు. మంగళవారం తీగలగుట్టపల్లి బస్తీ దవాఖానలో నిర్వహించిన ఆరోగ్య మహిళా క్యాంపును సందర్శించారు. అవుట్ పేషెంట్, ఎన్‌సీడీ రిజిస్టర్‌లను తనిఖీ చేశారు. ఫార్మసీ స్టోర్లను పరిశీలించి, మందుల లభ్యత, నిల్వలు తదితర అంశాలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ, ఆరోగ్య మహిళా క్యాంపులో 18 ఏళ్లు పైబడిన మహిళలకు నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల స్క్రీనింగ్ నిర్వహించడం, సూక్ష్మపోషక లోపాలు తదితర పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు, అవసరమైన సలహాలు అందిస్తున్నామని తెలిపారు. పీవో ఎంహెచ్‌ఎన్ డాక్టర్ సనాజవేరియా, వైద్యాధికారి లావణ్య, సిబ్బంది పాల్గొన్నారు.


