దాడులైనా దందా ఆగట్లే | - | Sakshi
Sakshi News home page

దాడులైనా దందా ఆగట్లే

Apr 1 2026 7:54 AM | Updated on Apr 1 2026 7:54 AM

కరీంనగర్‌అర్బన్‌: తప్పు చేస్తే అధికారులు పట్టుకుంటున్నారంటే ఎవరికై నా భయమే. కానీ నగరంలో యథేచ్ఛగా వంట గ్యాస్‌ దందా సాగుతుందంటే లోపమొక్కడా.. తీవ్రత లేని కేసులు నమోదు చేయడమా, అధికారులతో ఉన్న అనుబంధమా..నన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వంట గ్యాస్‌ పక్కదారి పడితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ప్రకటనలకే తప్ప ఆచరణలో ఆమడదూరం. జిల్లా కేంద్రంలో ఇప్పటివరకు సివిల్‌ సప్లయ్‌, విజిలెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నాలుగు సార్లు తనిఖీలు నిర్వహించగా పట్టుకున్న ప్రతీసారి పదుల సంఖ్యలో సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. తాజాగా మంగళవారం విజిలెన్స్‌, సివిల్‌ సప్లై అధికారులు సంయుక్తంగా తనిఖీ చేపట్టారు. జెస్సికా రీఫిలింగ్‌ సెంటర్లో 6 సిలిండర్లు, 13 హోటల్స్‌లో ఉపయోగిస్తున్న 21 గ్యాస్‌ సిలిండర్లను సీజ్‌ చేశారు. యజమానులపై 6ఏ కేసు నమోదు చేశారు. విజిలెన్స్‌ అధికారులు ఆకారపు దినేశ్‌రెడ్డి, సివిల్‌ సప్లై డిప్యూటీ తహసీల్దార్‌ సురేందర్‌, ఎఫ్‌ఐ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొనగా మెరుపుదాడులు నిర్వహించారు. కానీ, మరోవైపు హోటళ్లలో వినియోగం సాగుతూ..నే ఉండటం విశేషం.

సరఫరాదారులపై చర్యలేవీ

గ్యాస్‌ కొరత పుకార్ల క్రమంలో విరివిగా దాడులు నిర్వహిస్తున్న అధికారులు పాత్రధారుల వరకే కేసులను పరిమితం చేస్తున్నారు. అసలు గ్యాస్‌ సరఫరా చేసిందెవరు, ఏ ఏజెన్సీ నుంచి సరఫరా జరిగింది, సదరు గ్యాస్‌ సిలిండర్‌ వినియోగదారుడెవరనే కోణంలో చర్యలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సదరు ప్రక్రియలో విచారణ చేసి గ్యాస్‌ వినియోగదారుల గ్యాస్‌ కనెక్షన్‌ రద్దు చేయడం, గ్యాస్‌ ఏజెన్సీని సీజ్‌ చేయడం వంటి కఠినచర్యలు చేపడితే బ్లాక్‌ మార్కెట్‌ గొడవే ఉండదన్నది సుస్పష్టం. కేవలం హోటళ్లు, రీఫిల్లింగ్‌ సెంటర్లపై 6ఏ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సదరు కేసుతో ఒరిగేదేం లేదని ఇటీవల పట్టుబడిన హోటల్‌ నిర్వాహకుడొకరు చెప్పడం కొసమెరుపు. ఇటీవల ఎక్కడెక్కడ తనిఖీలు నిర్వహించారో హెచ్చు హోటళ్లలో వంట గ్యాస్‌ వినియోగిస్తుండటం చట్టంలోని లోపాలా..? లోపాయికారి ఒప్పందమా..నన్న వాదన వినిపిస్తోంది.

అంతటా వంట గ్యాసే

వంట గ్యాస్‌ బ్లాక్‌ మార్కెట్‌కు చేరకుండా చర్యలు చేపట్టామని సివిల్‌ సప్లయ్‌ అధికారులు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో విరుద్ధ పరిస్థితి నెలకొంది. టి ఫిన్‌ సెంటర్లు, రెస్టారెంట్లు, ప్రముఖ హోటళ్లు, దా బాలు, ప్రైవేట్‌ హాస్టళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, చిరుతిళ్ల తయారీ కేంద్రాల్లో బహిరంగంగా వంట గ్యాస్‌ వినియోగిస్తున్నారు. పలు చోట్ల తట్టుసంచులను క ప్పి వినియోగిస్తుండగా ప్రముఖ హోటళ్లలో పదుల సంఖ్యలో డొమెస్టిక్‌ సిలిండర్లు దర్శనమిస్తున్నాయి. కొందరు చుట్టు పక్కల ప్రాంతాల్లో సిలిండర్లను నిల్వ చేసి అవసరమైన సమయంలో వినియోగిస్తున్నారు. కాగా కమర్షియల్‌ సిలిండర్లను మాత్రమే వాడాలని ఇప్పటికే స్పష్టం చేశామని, వంట గ్యాస్‌ వినియోగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి నర్సింగరావు తెలిపారు.

విచ్చలవిడిగా వంటగ్యాస్‌ వినియోగం

తీవ్రతలేని కేసుల నమోదే కారణమా?

క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తేనే అడ్డుకట్ట

పాత్రధారులు కాకుండా సూత్రధారులపై చర్యలేవీ?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement