కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామానికి చెందిన మహిళపై దాడి చేసి బంగారు పుస్తెల తాడు అపహరించిన వ్యక్తిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కొత్తపల్లి ఎస్‌హెచ్‌వో, ట్రైనీ ఐపీఎస్ సోహం సునీల్ వివరాల మేరకు.. ఈ నెల 26వ తేదీన సాయంత్రం ఖాజీపూర్‌లో గేదెలను మేపుతున్న గడ్డం మాధవిపై అదే గ్రామానికి చెందిన సుంకె శ్రీధర్ దాడి చేశాడు. ఆమె మెడలోని బంగారు పుస్తెల తాడు దొంగిలించి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి శ్రీధర్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. బంగారు పుస్తెలతాడు స్వాధీనం చేసుకున్నాం. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా 14రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్‌హెచ్‌వో పేర్కొన్నారు.
మ్యూల్ ఖాతాల కేసులో నోటీసులు
కరీంనగర్‌క్రైం: మ్యూల్ ఖాతాలను ఉపయోగించి సైబర్ నేరస్తులతో రూ.138 కోట్ల లావాదేవీలు నిర్వహించిన కేసులో త్రీటౌన్ పోలీసులు శుక్రవారం 13 మందిని కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు వివరాలు పరిశీలించిన కోర్టు వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పోలీసులు 35 బీఎన్‌ఎస్‌ఎస్ ప్రకా రం నోటీసులు అందించారు. ఈ కేసు విచా రణ కొనసాగుతుందని, మరికొంతమందిపై ఆరా తీస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి: 33 కె.వీ.విద్యుత్ లైన్ల పనులు చేపడుతున్నందున ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రెడ్డి ఫంక్షన్‌హాల్, మాణికేశవనగర్, తీగలగుట్టపల్లి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు కరీంనగర్ రూరల్ ఏడీఈ గాదం రఘు తెలిపారు.
ఆస్తి తీసుకుని పోషించడం లేదని..
కథలాపూర్: ఆస్తి తీసుకుని తనను పోషించడంలేదని మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రండం పుల్లయ్య తన చిన్న కూ తురు లావణ్యతో కలిసి శనివారం కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. పోతా రం గ్రామానికి చెందిన రండం పుల్లయ్యకు ఇద్దరు కూతుళ్లు. ఓ కూతురు పోతారంలో నివసిస్తోంది. చిన్న కూతురు లావణ్య కోరుట్లలో ఉంటోంది. తన ఆస్తి గ్రామంలో ఉంటున్న కూతురు తీసుకుందని, వృద్ధాప్యంలో ఉన్న తనను పోషించడంలేదని పుల్లయ్య చిన్న కూతురితో కలిసి ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి న్యాయం చేస్తామని ఆర్డీవో వృద్ధుడికి సూచించారు.


