పంచాయతీలకు పన్ను ఎగవేస్తున్న గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీలు
రూ.కోట్లల్లో వ్యాపారం.. పన్నుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం
చోద్యం చూస్తున్న అధికారులు
నోటీసులిచ్చినా స్పందించని యజమానులు
ఆదివారం శ్రీ 29 శ్రీ మార్చి శ్రీ 2026
సీతారాములకు పట్టాభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కొత్తపల్లి(కరీంనగర్):
కొత్తపల్లి మండల పరిధిలోని గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీల పన్ను బకాయిలు గ్రామ పంచాయతీలకు గుది‘బండ’గా మారాయి. పన్ను ఎగవేయడంతో గ్రామాలాభివృద్ధికి విఘాతం కలుగుతోంది. రూ.కోట్ల వ్యాపారం చేస్తూ.. రూ.వేల పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. మూడేళ్లుగా పంచాయతీలకు రూ.కోట్లలో బకాయిలు పెండింగ్‌లో పడ్డాయి. నోటీసులు జారీ చేసినప్పటికీ పట్టించుకోకపోగా.. అధికారులు చోద్యం చూస్తున్నారు. కలెక్టర్ స్పందించి గ్రానైట్ మాఫియాపై కొరడా ఝళిపించాలని పంచాయతీ పాలకవర్గాలు కోరుతున్నారు. గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీల పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచిస్తున్నారు.
వందల ఫ్యాక్టరీలు.. రూ.కోట్లల్లో బకాయిలు
కొత్తపల్లి మండలం ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల, బద్దిపల్లి, కమాన్‌పూర్ గ్రామాల్లో సుమారు 300 పైచిలుకు గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీలున్నాయి. రూ.కోట్లల్లో పెట్టుబడులు పెట్టిన యజమానులు మూడేళ్లుగా ఆయా పంచాయతీలకు రూ.వేలలో పన్ను చెల్లించడంతో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆసిఫ్‌నగర్‌లో 110 ఫ్యాక్టరీలకు 84, ఖాజీపూర్‌లో 170 ఫ్యాక్టరీలకు 150, ఎలగందులలో 25 ఫ్యాక్టరీలు, బద్దిపల్లిలో 21, కమాన్‌పూర్‌లో 8 ఫ్యాక్టరీలు ప్రస్తుతం గ్రానైట్ వ్యాపారం చేస్తున్నాయి. ఒక్కో ఫ్యాక్టరీ ఏరియాను బట్టి ఏడాదికి రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లుగా ఏ ఒక్క ఫ్యాక్టరీ పన్ను చెల్లించడం లేదు. రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోయాయి. పన్నుల వసూళ్లలో గ్రామ పంచాయతీలు పూర్తిగా విఫలమవ్వగా, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అసోసియేషన్ జోక్యం
గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీల పన్ను ఎగవేత విషయంలో గ్రానైట్ కట్టింగ్, పాలీసింగ్ అసోసియేషన్ జోక్యం చేసుకోవడం గ్రామ పంచాయతీలకు ఇబ్బందిగా మారింది. గతంలో ఆసిఫ్‌నగర్‌లోని ఫ్యాక్టరీలకు కొంత మొత్తం పన్ను చెల్లించాలంటూ పంచాయతీ అధికారులు ఓ పాలసీ చేస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపారు. అప్పుడున్న అసోసియేషన్ ప్రతినిధులు తమ రాజకీయ పలుకుబడితో అభ్యంతరం వ్యక్తం చేయడంతో పన్ను చెల్లింపులు అటకెక్కాయి. అప్పటి నుంచి నేటి వరకు పన్నుల చెల్లింపు ఊసేలేకపోగా.. నూతనంగా ఏర్పడ్డ పంచాయతీ పాలకవర్గాలు ఎలాగైనా పన్నులు వసూలు చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో గ్రానైట్ కట్టింగ్ ఫ్యాక్టరీలు పన్నులు చెల్లించాలని పంచాయతీలు నోటీసులు జారీ చేస్తున్నాయి. అయినప్పటికీ స్పందన లేకపోగా.. కలెక్టర్ రంగంలోకి దిగి ప్రత్యేక డ్రైవ్ చేపడితే తప్ప సమస్యకు పరిష్కారం అయ్యేలా లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గ్రానైట్ ఫ్యాక్టరీలు పన్ను చెల్లించాల్సి ందే. అనేక ఫ్యాక్టరీలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. మూడేళ్లుగా పన్నులు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తుండటంతో అభివృద్ధి కుంటుపడింది. పన్నులు చెల్లించాలని నోటీసులు జారీ చేసినా స్పందించడం లేదు. కలెక్టర్ జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలి.
– తాండ్ర శ్రీనివాస్, సర్పంచ్ బద్దిపల్లి


