కరీంనగర్‌టౌన్: స్కాలర్షిప్ విద్యార్థులకు భిక్ష కాదని, హక్కు అని ఏబీవీపీ జిల్లా కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.9,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలని బొమ్మకల్ బైపాస్ రోడ్‌లో ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్నా విద్యార్థులకు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. బడ్జెట్‌లో విద్యారంగానికి కనీసం 15 శాతం కేటాయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. ఇంజినీరింగ్, ఫార్మా కళాశాలల్లో ఫీజుల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర హాస్టల్స్ కో కన్వీనర్ నందు, మురళి, యోగేశ్, శివ, ఆకాష్, అజయ్, యశ్వంత్, కాఫీ, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
ఖైదీలకు వైద్య పరీక్షలు
కరీంనగర్‌క్రైం: వందరోజుల హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈసందర్భంగా బీపీ, షుగర్, హెచ్‌ఐవీ, సిఫిలిస్, హైపటైటిస్ బి, సీ సంబంధిత వ్యాధులను ముందుగానే గుర్తించేందుకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అదనపు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ సుధా రాజేంద్ర, జైలు సూపరింటెండెంట్ జి.విజయదేని, డాక్టర్ కె.వేణుగోపాల్, జిల్లా ఎయిడ్స్ ప్రొగ్రాం మేనేజర్ సురేందర్‌రెడ్డి, కన్వీనర్ మహిపాల్, ప్రాజెక్టు కోఆర్డినేటర్ దేవేందర్ పాల్గొన్నారు.


