రైలులో ప్రయాణికుడి హఠాన్మరణం | - | Sakshi
Sakshi News home page

రైలులో ప్రయాణికుడి హఠాన్మరణం

Mar 24 2026 7:05 AM | Updated on Mar 24 2026 7:05 AM

రామగుండం: కర్ణాటక రాష్ట్రంలోని యెలహంక నుంచి మధ్యప్రదేశ్‌లోని గ్వా లియర్‌కు వెళ్తు న్న ప్రయాణికుడు ధర్మేంద్రసింగ్‌ రాథోర్‌(42) సోమవారం అస్వస్థతతో హఠాన్మరణం చెందాడు. జీఆర్పీ ఔట్‌పోస్టు ఇన్‌చార్జి తిరుపతి కథనం ప్రకారం.. బెంగళూరులో టైల్స్‌ వర్క్‌ చేసే ధర్మేంద్రసింగ్‌రాథోర్‌ రైలు నంబరు 11085లో ఆదివారం సాయంత్రం గ్వాలియర్‌ వెళ్తున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణం చేస్తున్నాడు. బోగినంబరరు ఎస్‌–4లో పడుకున్న ప్రయాణికుడిని సోమవారం ఉదయం టికెట్‌ పర్యవేక్షకుడు నిద్రలేపారు. ఎంతకీ లేకపోవడంతో సెంట్రల్‌కు మెసేజ్‌ ఇచ్చాడు. అప్పటికే రైలు కాజీపేట దాటింది. బల్హార్షా వరకు హాల్టింగ్‌లేదు. అత్యవసరంగా రామగుండం రైల్వేస్టేషన్‌లో నిలిపి రైల్వే డాక్టర్‌తో పరీక్షించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్‌ ధ్రువీకరించడంతో మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆధార్‌కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు పూర్తిగా తెలియరాలేదు.

బాలుడిని కాటేసిన కరెంట్‌

మెట్లకింద ఆడుకుంటుండగా విద్యుదాఘాతం

ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కటికెనపల్లి గ్రామానికి చెందిన బొజ్జ సంపత్‌ కుమారుడు బొజ్జ అభిరాం(6) సోమవారం సాయంత్రం ప్రమాదవశాత్తు కరెంట్‌ షాక్‌కు గురై మరణించినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఇదే గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లిన అభిరాం.. సమీపంలోని బల్ల కుమార్‌ ఇంటి వద్ద అడుకుంటూ ఉన్నాడు. ఈక్రమంలో మెట్ల కిందికి వెళ్లగా అక్కడఉన్న కరెంట్‌ ఎర్త్‌వైర్‌కు ప్రమాదవశాత్తు తగిలాడు. దానితో కరెంట్‌ షాక్‌కు గురై అక్కడకక్కడే మరణించినట్లు మృతి తండ్రి సంపత్‌ ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

ప్రమాదఘటన చూసి.. భయంతో సొమ్మసిల్లి

మృతి చెందిన మహిళ

రఘునాథపల్లి: హన్మకొండ–హైదరాబాద్‌ జాతీయ రహదారిలోని వెంకటాయపాలెం వద్ద సోమవారం జరిగిన ప్రమాద ఘటనను చూసిన ఓ మహిళ తీవ్ర భయాందోళన చెంది మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలం పందిళ్ల గ్రామానికి చెందిన ఇల్లందుల పుష్పలత (45) కుటుంబ సభ్యులతో కలిసి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. వెంకటాయపాలెం వద్ద టాయ్‌లెట్‌ కోసం కారు నిలిపి పుష్పలత కిందకు దిగగా, అదే సమయంలో ఓ ద్విచక్రవాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఘటనను చూసిన పుష్పలత సొమ్మసిల్లి పడిపోగా కుటుంబ సభ్యులు వెంటనే జనగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దూదిమెట్ల నరేశ్‌ తెలిపారు.

త్వరలో క్యాథ్‌ల్యాబ్‌ సేవలు

గోదావరిఖని: సింగరేణిలోనే తొలిసారి ఏర్పాటు చేస్తున్న క్యాథ్‌ ల్యాబ్‌ పనులపై ఆ సంస్థ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ కిరణ్‌రాజ్‌కుమార్‌ సోమవారం సమావేశమయ్యారు. రెనే హాస్పిటల్‌, హాస్పిటల్‌ వెండర్స్‌ మధ్య సమావేశం నిర్వహించారు. పనులు యుద్ధ ప్రాతిపదిక పూర్తిచేసి త్వరగా ప్రారంభించాలని ఆయన సూచించారు. డాక్టర్లు బాలకోటయ్య, అంబికా, రాజేశ్వర్‌రావు, రమేశ్‌, రెనే హాస్పిటల్‌ చైర్మన్‌ బంగారి స్వామి, డాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement