జమ్మికుంట: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ సీనియర్ నేతలు తిరుగుబాటుకు దిగడం కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే వైఖరిపై మొదటి నుంచి పార్టీ మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్లు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. పలుమార్లు అధిష్టానం వద్దకు పంచాయితీ వెళ్లినా మార్పు రావడం లేదని శుక్రవారం రాత్రి మరోసారి రహస్య సమావేశం అయ్యారు. ఇందుకు జమ్మి కుంట పట్టణ పరిధిలోని ఓ ప్రైవేటు వెంచర్ వేదిక కాగా.. నియోజకవర్గస్థాయి నాయకులు హాజరై తమ అసంతృప్తిని వెల్లగక్కినట్లు సమాచారం. పార్టీ అధిష్టానా న్ని కలిసి తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
ఎమ్మెల్యే దూకూడు
హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తారని పేరుంది. ఇతర పార్టీలతో పాటు తమ పార్టీ నాయకులపైనా విరుచుకపడతారనే ఆరోపణలున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్, మున్సి పల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో ఒంటెద్దుపోకడగా వ్యవహరించార ని పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేపై పార్టీ సీనియర్ నాయకులంతా గుర్రుగా ఉన్నారు. శుక్రవారం రాత్రి జమ్మికుంటలో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు రహస్యంగా సమావేశమయ్యారు. తీరుమారకుంటే ఉద్యమ పార్టీకి గుడ్‌బై చెప్పి అధికార పార్టీలో చేరే అంశంపై చర్చ జరిగిందని తెలిసింది. ఈ పంచాయితీని త్వరలోనే కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. అధిష్టానం కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది.


