సిద్దిపేటలో మెడికో ఆత్మహత్య.. మడిపల్లిలో విషాదం
కాల్వశ్రీరాంపూర్/సుల్తానాబాద్ రూరల్: సిద్దిపేట జిల్లాలోని ఓ మెడికల్ కాలేజీ హాస్టల్ గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న మొడికో శ్రీజ ఘటనతో రెండు గ్రామాల్లో విషాదం అలముకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మడిపల్లి కాలనీకి చెందిన శ్రీజ చిన్నతనంలోనే తల్లిదండ్రులు స్వరూప–రాయలింగును కోల్పోయింది. ఒంటరిగా మారిన శ్రీజను మేనమామ సట్టు బాపు– పుష్పలత దంతపులు తమ స్వగ్రామం సుల్తానాబాద్ మండలం మూడుజాముల కొదురుపాకకు తీసుకెళ్లారు. అక్కడే పెంచిపోషిస్తున్నారు. అయితే, మంచిమార్కులతో పాసైన శ్రీజ సిద్దిపేట మెడికల్ కాలేజీలో ఫిజియోథెరపీ సీటు సంపాదించుకుంది. పేదరికంలో ఉన్న మేనమామ దాతల సాయం కోరాడు. కొందరు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేశారు. దీంతో ప్రథమ సంవత్సరం చదువుతున్న శ్రీజ.. హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుంది. ఆమె మృతి సమాచారం అందడంతో మేనమామ వెంటనే సిద్దిపేటకు బయలుదేరి వెళ్లాడు. మడిపల్లికాలనీ, కొదురుపాకలో విషాదం అలముకుంది.


