ఈ గెలుపెవరిది !?
సిరిసిల్ల: సమకాలీన అంశాలపై తనదైన శైలిలో స్పందించే యువకవి చిందం మల్లేశం.. ఇటీవల జరిగిన ఎన్నికలపై తన అక్షరాలను సందించారు. జిల్లా కేంద్రంలోని బీవై నగర్‌కు చెందిన మల్లేశం బతుకుదెరువు కోసం గంభీరావుపేట మండలం భీమునిమల్లారెడ్డిపేటలో మెడికల్‌షాపు నిర్వహిస్తూ.. ‘పాళీ’ పేరుతో అక్షరసేద్యం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటర్ల చైతన్యాన్ని అభినందిస్తూనే.. అమ్ముడుపోయారని.. ఐదేళ్ల దోపిడీకి అడ్డ‘దారులు’ తెరిచారంటూ అక్షరరూపంలో వ్యంగ్యంగా చెప్పారు. పాళీ సాహిత్య సృజన ఇదీ..
ఈసారి సిరిసిల్లలో సిట్టింగ్ కౌన్సిలర్లు కొందర్ని
పనిగట్టుకుని మరీ ఓడించారు
అది కూడా పనిచేసే నాయకులని
మార్పు కోరుకున్నారో..
ఒకే ముఖాన్ని పది యేండ్ల నుంచి చూసిన బోరుతనమో తెలియదు..
అది ప్రజల నిర్ణయం అనుకోండి..
కానీ పని చేసే నాయకులని కూడా పక్కకు పెట్టడం అంటే
రాజకీయ చైతన్యంతోపాటు కుల, మత రాజకీయాలు కూడా
ఓటర్లు ప్రవేశపెట్టారు అనేది అర్థం అవుతుంది.
అత్యధిక సంఖ్యలో ఉన్న వర్గం నుంచి ఇంతటి చైతన్యం జనాలు కోరుకున్నారు.
ఒకప్పుడు సాదాసీదాగా జరిగే ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీ అయిపోయాయి
ఓటర్లు తెలివిగా నాయకులతో ఆడుకున్నారు
ఎక్కడైనా నాయకుడు జనాలని మోసం చేయటం చూస్తుంటాం
కానీ ఒక ఓటరు నాయకుణ్ణి నమ్మించి మాట ఇచ్చి
గొంతు కోయడం చాలా దగ్గర నుంచి చూసిన ఫీలింగ్ కలిగింది.
ఓటర్లు ఐదేళ్ల కాలంలో నాయకుని నుంచి ఏం ఆశిస్తున్నారు
అభివృద్ధా, డబ్బులా లేక సమస్యలకు పరిష్కారాలా..
పలానా పార్టీ వాళ్లు ఇంత ఇస్తున్నారు.. మీరు ఎంత ఇస్తారు?
చాలా ఓపెన్‌గా అడగడం ఈ ఎన్నికల్లో కళ్లారా కనిపించింది.
ఇది ఇలాగే కొనసాగితే..
సిరిసిల్ల మున్సిపల్ ఎన్నికలు
ఒక వర్గపు ఎన్నికలుగా పేర్కొనవచ్చు
ఏది ఏమైనా పదవి అనేది కొందరికీ ఫ్యాషన్, ప్రేమ, సేవ
కొందరికీ సంకల్పం.
ఎవరూ బరిలో ఉన్న గెలవాలనేదే లక్ష్యం
కొందరు ఆర్థికంగా స్థిరపడి వస్తారు
కొందరు సేవ చేయాలనే ఉద్దేశ్యంతో వస్తారు
కొందరు అప్పు చేసి మరీ రాజకీయాల్లోకి వస్తారు
ఈసారి పోటీ చాలా తీవ్రంగా కనిపించింది
రాజకీయ చైతన్యం వచ్చింది అని సంబరపడాలా..
ఓటరు ఇంకా అక్కడే ఉండిపోయాడు అని బాధపడాలా..
కనీసం రాజ్యాంగం ఊసు ఎక్కడైనా వినిపించిందా..
అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశంలో ఇంకా..
ఓటరు అవినీతిగానే ఓటు వేయాలా !
పదవి వరించకపోగా
శత్రువులను ఆర్థిక ఇబ్బందులను మూట గట్టుకొని
పక్కకు జరగడం చూస్తారు.
అయితే దొరికిందే తడువుగా ఓటరు నాయకుణ్ణి దోచేస్తున్నాడు.
ఎంతమంది నించుంటే అందరి దగ్గర డబ్బులు తీసుకొని
తడబడి ఓటు వేయడం అవినీతి ఓటుని సూచిస్తుంది
ఎంతమంది ఓటర్లు..
తమతమ వార్డుల్లో సమస్యలను
అక్కడ నించున్న నాయకులకు వినిపించారు
ఏయే పనులు డిమాండ్ చేశారు
అంటే ఏమో అనే సమాధానం వస్తుంది.
అవినీతి రహిత పాలనను కోరుకునే ప్రతీ ఓటరు
డబ్బులు తీసుకోకుండా
సమస్యలను ముందుంచి
నిజమైన నాయకున్ని ఎన్నుకొని
పనిచేయించుకోవాల్సిన అవసరము ఉంది.
అవినీతి రహిత ఓటును వేద్దాము
అభివృద్ధికి బాటలు వేద్దాము
79 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో
వీధిలైట్లు.. మోరీలు.. నల్లానీళ్లు..
.. ఇవి అడగడం దగ్గరే ఆగిపోయాడు ఓటర్.
– పాళీ(చిందం మల్లేశం), భీమునిమల్లారెడ్డిపేట
పాళీ ప్రశ్నల అక్షరసేద్యం


