నిబంధనల మేరకే ఇసుక తీయండి
కరీంనగర్ అర్బన్: నిబంధనలను పక్కాగా అమలు చేస్తూ ఇసుక తీయాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. నదులపై చెక్ డ్యాములు నిర్మించిన చోట భద్రత దృష్ట్యా డ్యాముకు ఎగువన, దిగువన 300 మీటర్ల వరకు ఇసుక తోడడం నిషేధమని, అధికారులు ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని అన్నారు. జిల్లా పరిధిలోని నదీప్రవాహాలకు సంబంధించి సరిహద్దులను పక్కాగా గుర్తించి రికార్డు చేయాలని సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ, ఆర్‌డబ్ల్యూఎస్, టీజీఎండీసీ, పోలీస్ అధికారులు సమన్వయంతో ఇసుక రీచ్‌లను తనిఖీ చేయాలన్నారు. మన ఇసుక వాహనం ఆన్‌లైన్ పోర్టల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక కేటాయింపుపై అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రౌండ్ వాటర్ డీడీ శ్యాంప్రసాద్ నాయక్, డీపీవో జగదీశ్వర్, జిల్లా జియాలజిస్ట్ ప్రసన్న, డీఈఈ రాజేందర్, డిప్యూటీ డీఈ వేణుగోపాల్, మైన్స్ ఏడీ రాఘవరెడ్డి, టీజీఎండీసీ పీడీ శ్రీనివాస్, డిప్యూటీ ఈఈ రవి, ఆర్‌వో కనకజ్యోతి పాల్గొన్నారు.


