వేధించిన కొడుకు.. కడతేర్చిన తండ్రి
మానకొండూర్: వేధించిన కుమారుడిని ఓ తండ్రి కడతేర్చిన హృదయవిదారక ఘటన మానకొండూర్ మండల కేంద్రంలో జరిగింది. సీఐ సంజీవ్ తెలిపిన వివరాలు.. మానకొండూర్‌కు చెందిన పురం లక్ష్మి, కనుకయ్య దంపతులకు నలుగురు కుమారులు, కుమార్తె సంతానం. చిన్న కుమారుడు శ్రీనివాస్ (35) మినహా అందరికీ వివాహాలు అయ్యాయి. ఏడేళ్ల క్రితంరోడ్డు ప్రమాదంలో లక్ష్మి చనిపోయింది. దీంతో శ్రీనివాస్, కనుకయ్య కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఈనేపథ్యంలో తండ్రిని శ్రీనివాస్ నిత్యం మద్యం తాగి వేధించేవాడు. సోమవారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. అనంతరం శ్రీనివాస్ నిద్రపోయాడు. ఈక్రమంలో కొడుకు వేధింపులు భరించలేక మంగళవారం వేకువజామున బండరాయితో తలపై కొట్టడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే మరో కుమారుడికి విషయాన్ని తెలిపాడు. ఉదయం కనుకయ్య పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఘటన స్థలాన్ని ఏసీపీ విజయ్‌కుమార్ పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
మద్యం తాగి నిత్యం గొడవలు
తలపై బండతో మోది హత్య


