ఉరేసుకుని బాలిక ఆత్మహత్య
పెగడపల్లి: అనారోగ్యంతో బాలిక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని నందగిరిలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మక్కపల్లి మల్లేశం, రామలక్ష్మి దంపతులకు కుమారుడు మల్లికార్జున్, కూతురు రమ్య ఉన్నారు. రమ్య కరీంనగర్‌లో పదో తరగతి చదువుతోంది. పదిరోజుల క్రితం ఇంటికొచ్చింది. మల్లేశం ఒగ్గుకథ చెప్పేందుకు కొమురవెళ్లి వెళ్లాడు. తల్లి ఆరుబయట బీడీలు చుడుతోంది. ఆమె లోపలికి వెళ్లేసరికి రమ్య (15) ఉరేసుకుని కనిపించింది. ఆమె కిడ్నీలో రాళ్లు వచ్చాయని, కడుపునొప్పితో బాధపడుతోందని, అనారోగ్యంతోనే ఆత్మహత్య చేసుకుందని రామలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అనారోగ్య సమస్యలతో వృద్ధుడు..
వీర్నపల్లి: మండలంలోని కంచర్లలో మంగళవారం అనారోగ్య సమస్యలతో గొళ్లెం వెంకటి (85) ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకటి కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. బాధలు భరించలేక మంగళవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి భార్య శివవ్వ, ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆరుగురు పిల్లలకు పెద్దదిక్కుగా ఉన్న వెంకటి మరణంతో కంచర్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకేసులో జీవిత ఖైదు
సుల్తానాబాద్‌రూరల్: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కొదురుపాక గ్రామానికి చెందిన వృద్ధురాలు చంద్రమ్మను హత్యచేసి మెడలోంచి బంగారు గొలుసు ఎత్తుకెళ్లిన అదే గ్రామానికి చెందిన కోదాటి సంపత్‌రావు(38)కు జీవిత ఖైదు, రూ.10వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు జడ్జి సునీత మంగళవారం తీర్పు వెలువరించారని ఎస్సై చంద్రకుమార్ తెలిపారు. చోరీలు చేస్తూ జులాయిగా తిరిగే సంపత్‌రావు.. 2019లో తన ఇంటిఎదుట ఒంటరిగా ఉంటున్న చంద్రమ్మ ఇంట్లోకి చొరబడి బంగారం గొలుసు చోరీచేశాడన్నారు. అంతటితో ఆగకుండా పీటతో తలపై బాది వృద్ధురాలిని హత్య చేశారని పేర్కొన్నారు. మృతురాలి కుమారుడు రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని సాక్ష్యాధారాలు, సాక్షులను కోర్టులో ప్రవేశ పెట్టామని వివరించారు. ఇరువర్గాల వాదనలు విన్న జడ్జి తీర్పు వెలువరించినట్లు ఎస్సై పేర్కొన్నారు.
ఉరేసుకుని బాలిక ఆత్మహత్య


