పెద్దపులి దాడిలో మూడు లేగ దూడల మృతి
ఇల్లంతకుంట: మండలంలోని పెద్ద లింగాపురంలో సోమవారం రాత్రి మూడు లేగదూడలను పెద్దపులి దాడిచేసి చంపింది. వివరాలు ఇలా ఉన్నాయి.. రైతులు గుర్రాల మల్లయ్య, మంగళం సుధాకర్‌లకు పాడి పశువులను తమ వ్యవసాయ పొలాల వద్ద కట్టివేశారు. వీరి పొలాలు తిప్పాపురం గుట్టల సమీప ప్రాంతంలో ఉండటంతో మల్లయ్య కట్టివేసిన నాలుగు పశువుల్లో మూడింటిపై పెద్దపులి దాడి చేసి రెండింటిని చంపగా ఒకదానిని గాయపర్చింది. అదేవిధంగా సుధాకర్ నాలుగు పశువులను కట్టివేయగా ఒక లేగ దూడపై దాడి చేసి చంపింది. మంగళవారం ఉదయం విషయం తెలుసుకున్న రైతులు జిల్లా ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఫారెస్ట్ అధికారులు తమ సిబ్బందితో కలిసి సంఘటన జరిగిన ప్రాంతంలో వివరాలు సేకరించారు. హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి వచ్చిన సిబ్బంది కూడా పెద్దపులి ఆనవాళ్ల సేకరణలో పాల్గొని ధ్రువీకరించారు. సంఘటన జరిగిన ప్రాంతంలో ట్రాప్ కెమెరాలను అమర్చారు. పరిసర ప్రాంతాల రైతులు జాగ్రత్తగా ఉండాలని, రాత్రివేళ పొలాల వద్దకు వెళ్లొద్దని సూచించారు. మరణించిన పశువులను పోస్టుమార్టం చేయగా, గాయపడ్డ లేగ దూడకు గాలిపెల్లి పశువైద్యాధికారి ఇందిర వైద్య చికిత్స చేశారు.
పెద్దపులి దాడిలో మూడు లేగ దూడల మృతి


