వ్యాపారవేత్త జువ్వాడి రాజేశ్వరరావు మృతి
● హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబం ● అక్కడే అంత్యక్రియలు పూర్తి ● తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో ఆయన పేరు ప్రస్తావన
బుగ్గారం: బుగ్గారం మండలం మద్దునూర్‌కు చెందిన వ్యాపారవేత్త జువ్వాడి రాజేశ్వరరావు(99) మృతి చెందారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ముందు గ్రామాల్లో కొనసాగిన దొరల పాలనలో ఈయన చివరి పాలకుడు. జమీందార్ వ్యవస్థకు వ్యతిరేకంగా రైతుల తిరుగుబాటుతోపాటు మావోయిస్టుల దాడులు తీవ్రమవడంతో 50 ఏళ్ల క్రితం హైదరాబాద్ వలస వెళ్లారు. కుటుంబంతో అక్కడే స్థిరపడ్డారు. పలు వ్యాపారాల్లో ఖ్యాతి గడించిన ఆయన చనిపోగా.. అక్కడే అంత్యక్రియలు పూర్తి చేశారు. ఆయన మృతికి పలువురు సంతాపం తెలిపారు. తెలంగాణ చరిత్ర పుస్తకాల్లో రాజేశ్వరరావు పేరు ప్రస్తావనలో ఉంది. ఇదే గ్రామంలో భూస్వాముల పటేల్‌గా వ్యవహరించిన నారాయణరావు పీజెంట్(రైతుకూలీలు) కార్యకర్తల చేతిలో హత్యకు గురవడం రైతు ఉద్యమంలో సంచలనం సృష్టించింది. జగిత్యాల జైత్రయాత్రకు ముందు ఈ జిల్లాలో మావోయిస్టు ఉద్యమం పుట్టుకకు తొలిబీజం ఇక్కడే పడినట్లు చరిత్రకారులు చెబుతుంటారు.


