బల్దియా వద్ద భద్రత
కరీంనగర్‌క్రైం: కరీంనగర్ బల్దియా పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సోమవారం పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. సీసీ గౌస్ ఆలం భద్రతను సమీక్షించారు. కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు ఇప్పటికే భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు జారీ చేశారు. ఇవి ఈనెల 16 ఉదయం 6 గంటల నుంచి 17 ఉదయం 6 గంటల వరకు అమలులో ఉంటాయి. భద్రతా కారణాల దృష్ట్యా మున్సిపల్ కార్యాలయాలకు వెళ్లే మార్గాల వద్ద పలుచోట్ల ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టారు.
కరీంనగర్‌క్రైం: హైదరాబాద్ అత్తాపూర్‌కు చెందిన న్యాయవాది మొహమ్మద్ అబ్దుల్ ఖాదీర్ దారుణ హత్యకు నిరసనగా కరీంనగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగంపల్లి నాగరాజు ఆధ్వర్యంలో సోమవారం న్యాయవాధులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అరుణ్‌కుమార్ మాట్లాడుతూ, దారుణ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా న్యాయవాదుల భద్రతకు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాదులు పెంచాల ప్రభాకర్‌రావు, కొరివి వేణుగోపాల్, లక్ష్మణ్‌రావు, పి.రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్‌టౌన్: ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజాక్షేత్రంలో ఉండి ఉద్యమిస్తేనే రానున్న ఎన్నికల్లో ప్రజలు గుర్తిస్తారని సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్‌లోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జిల్లా కార్యవర్గ సభ్యుడు బోయిని అశోక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, అందుకు గ్రామాల వారీగా కమిటీలు వేసుకొని ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మండలాల్లో గతంలో చేసిన అభివృద్ధిని ప్ర జలకు వివరించాలని జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ సూచించారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అందె స్వామి, జాగీరు సత్యనారాయణ, నాగెల్లి లక్ష్మారెడ్డి, గూడెం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
నగరంలో పవర్ కట్ ప్రాంతాలు
కొత్తపల్లి(కరీంనగర్): విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు పనులు చేపడుతున్నందున మంగళవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు టౌన్ 1, 2 ఏడీఈలు పి.శ్రీనివాస్‌గౌడ్, ఎం.లావణ్య తెలిపారు. 11 కేవీ కాపువాడ ఫీడర్ పరిధిలోని కాపువాడ, మారుతినగర్, అశోక్‌నగర్, అహ్మద్‌పుర, మీర ఆస్పత్రి, పాతబజార్, గౌరీశంకర్ కాంప్లెక్స్, బొమ్మకల్ రోడ్, వెంకటసాయి రోడ్, ఎన్‌ఎన్ గార్డెన్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 11 కేవీ ఉజ్వల పార్కు ఫీడర్ పరిధి కమాన్ మెయిన్‌రోడ్, గణేశ్‌నగర్, కిశోర్ ఆటోస్టోర్ ప్రాంతాలు, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11 కేవీ శివనగర్ ఫీడర్ పరిధి సప్తగిరికాలనీ, శివనగర్, రామాలయం, అస్లాంపుర, బైపాస్ రోడ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు 33/11 కేవీ బావుపేట విద్యుత్ సబ్‌స్టేషన్, ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 11 కేవీ నారాయణ ఎక్స్‌ప్రెస్ ఫీడర్ పరిధి బావుపేట, ఆసిఫ్‌నగర్, ఇండస్ట్రీయల్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని కరీంనగర్ రూరల్ ఏడీఈ రఘు పేర్కొన్నారు.
బల్దియా వద్ద భద్రత
బల్దియా వద్ద భద్రత


