కార్పొరేషన్‌పై 24/7 నిఘా
కరీంనగర్ కార్పొరేషన్: నగరపాలకసంస్థలో అవినీతికి తావులేకుండా 24/7 నిఘా పెడుతామని కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు తెలిపారు. సోమవారం నగరంలోని డీసీసీ కార్యాలయంలో మాట్లాడారు. కొత్తగా ఏర్పడిన బీజేపీ పాలకవర్గం అవినీతి అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు విజిలెన్స్ సెల్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో మేయర్‌గా అక్రమాలకు పాల్పడిన సునీల్‌రావును డిప్యూటి మేయర్‌గా, ఆయనకు కార్పొరేటర్‌గా సహకరించిన శ్రీనివాస్‌ను మేయర్‌గా చేయడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. బీజేపీకి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇచ్చినప్పటికి, మేయర్, డిప్యూటీ మేయర్‌లను చూసి భయపడుతున్నారన్నారు. అందుకే ప్రజల జేబులో నుంచి నయాపైసా పోకుండా తాను కాపలా కాస్తానని చెప్పారు. ఆర్‌టీఐ ద్వారా సమాచారం సేకరించి, బీజేపీ పాలకవర్గం చిన్న అవినీతి చేసినా విడిచిపెట్టమని స్పష్టం చేశారు. నగరపాలకసంస్థకు ప్రత్యేకంగా విజిలెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌ను కోరుతామని పేర్కొన్నారు. సునీల్‌రావు మేయర్‌గా ఉన్నప్పుడు అవినీతి పరుడు అని ఫిర్యాదు చేసిన బండి సంజయ్, ఇప్పుడు పార్టీలో చేర్చుకొని డిప్యూటీ మేయర్ చేశాడని విమర్శించారు.
టికెట్ల తేడాతో పది సీట్లు పోయాయి
కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో లోపాల కారణంగా ఎనిమిది నుంచి పది సీట్లు పోయాయని రాజేందర్‌రావు అంగీకరించారు. పాత, కొత్త పేరిట కొంతమంది నాయకులు పట్టుబట్టారని, అలాంటి పరిస్థితుల్లో టికెట్‌ల కేటాయింపుల వల్ల సీట్లు పోవడం వాస్తవమేనన్నారు. తమ పార్టీలో ప్రజాస్వామ్యం అధికంగా ఉంటుందని, తమ మాటే నెగ్గాలని నేతలు అనుకోవడం సహజమేనని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కార్పొరేటర్‌లు భాస్కర్‌నాయక్, గుమ్మడి రాజకుమార్, ఆకల నర్మదనర్సయ్య, ఆకుల నందిని ఉదయ్, పడిశెట్టి వసంతలక్ష్మి భూమయ్య, కల్లేపల్లి శారదబాలరాజు, సికిందర్ ఇక్రమ్ తదితరులు పాల్గొన్నారు.


