జమ్మికుంటలో ఎన్నికా..? వాయిదా?
జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. శుక్రవారం నాటి ఫలితాల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో క్యాంపు రాజకీయం జోరుగా సాగుతోంది. సోమవారం చైర్మన్‌ను ఎన్నుకోవాల్సి ఉండగా ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఎన్నికపై సందిగ్ధం ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య తీవ్రపోటీ కొనసాగుతుండగా బేరసారాలపై చైర్మన్ ఎన్నిక ఆధారపడి ఉందని సమాచారం. ఇరుపార్టీల కౌన్సిలర్లు ఇప్పటికే క్యాంపుల్లో ఉండగా.. చివరి క్షణంలో ఎవరు ఎటువైపు మద్దతు తెలుపుతారనేది ఉత్కంఠ రేపుతోంది.
బీజేపీ మద్దతు ఎవరికి?
జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఇండిపెండెంట్లతో కలిపి 15మంది కౌన్సిలర్లు ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు 11మంది మద్దతు ఉంది. ఎమ్మెల్యే ఎక్స్‌ఆఫీషియో ఓటుతో సంఖ్య 12కు చేరింది. బీజేపీ తరఫున నలుగురు గెలిచారు. వారు మద్దతు ఇచ్చిన వారికే చైర్మన్ పీఠం దక్కే అవకాశం ఉంటుంది. స్పష్టమైన మెజార్టీ ఉంటేనే చైర్మన్ ఎన్నిక జరగనుండగా.. కోరం లేకుంటే ఎన్నికను వాయిదా వేసే అవకాశం ఉంటుంటుందని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ ఎండీ.అయాజ్ తెలిపారు.
ఏర్పాట్లు పూర్తి..
హుజూరాబాద్: హుజూరాబాద్‌లో మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌన్సిల్‌లో కాంగ్రెస్ 16 మంది సభ్యులతో చైర్‌పర్సన్ పీఠాన్ని అధిరోహించనుంది. 05,13,16,30వార్డు సభ్యులు సొల్లు సునీత, సందమల్ల పుణ్య, బండ వెన్నెల, రొంటా సుహాసిని చైర్‌పర్సన్ బరిలో ఉన్నారు. సోమవారం 10 గంటలకు పురపాలక సంఘ కౌన్సిల్‌హాల్‌లో ప్రమాణస్వీకారం ఉంటుందని కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ తెలిపారు.


