విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
కొత్తపల్లి(కరీంనగర్): నేటి బాలలే రేపటి పౌరులని, విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకున్నప్పుడే సమాజంలో అన్యాయాలను ఎదిరించగలరని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సభ్యులు, ప్యానల్ న్యాయవాదులు తెలిపారు. కొత్తపల్లి మండలం మల్కాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘బాల వివాహ్ ముక్త్ భారత్’లో భాగంగా న్యాయ చట్టాలపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. బాల్య వివాహాలతో కలిగే అనర్థాలను వివరిస్తూ, బాల్య వివాహాల నిషేధ చట్టం– 2006 గురించి వివరించారు. చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం ద్వారా బాల్యం ఛిద్రమవుతుందని, అటువంటి ఘటనలు కనిపిస్తే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు పొక్సో చట్టం–2012 కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కోర్టు ఖర్చులు భరించలేని బాధితులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఉచితంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తుందన్నారు. జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సభ్యులు, న్యాయవాదులు పెరుక రంగయ్య పటేల్, చిట్టి చంద్రప్రకాశ్‌రెడ్డి, ఏ.కిరణ్‌కుమార్, మాన్వాడ రామాంజనేయులు, బలాసుల శాంతి కుమార్, హెచ్‌ఎం బి.భీమేశ్ పాల్గొన్నారు.


