ప్రతీ గర్భిణికి టిఫా తప్పనిసరి
కరీంనగర్: గర్భిణులకు టిఫా స్కాన్ తప్పనిసరి అని, సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యమివ్వాలని, తప్పనిసరి అయితేనే సిజేరియన్ చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్ మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని గురువారం తనిఖీ చేశారు. గర్భిణులు, పిల్లల వార్డును సందర్శించి, అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గైనకాలజిస్టులు, అనస్తీసియా, పిల్లల వైద్యులు, రేడియాలజిస్టులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఎక్కువ సంఖ్యలో సాధారణ ప్రసవాలు జరగడం విశేషమన్నారు. ఆదిలాబాద్ తర్వాత జిల్లాలోని పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య ఎక్కువగా ఉందన్నారు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో డెలివరీల సంఖ్య పెరుగుతోందన్నారు. సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గర్భిణికి ముందు నుంచే సాధారణ ప్రస వం ఆవశ్యకతపై ఏఎన్‌ఎం, ఆశా వర్కర్ల ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. శుక్రవారం సభకు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది హాజరుకావాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు కేంద్రంలో అవసరమైన వైద్య పరికరాల జాబితా సమర్పించాలన్నా రు. ఎంసీహెచ్‌లో మరిన్ని పడకలు ఏర్పాటుకు చ ర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, ఆర్‌ఎంవో నవీనా, ప్రోగ్రాం అధికారి సనా పాల్గొన్నారు.


