డీఎంఎఫ్‌టీ నిధులపై కేంద్రం నజర్
డీఎంఎఫ్‌టీ అంటే.. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్‌టీ). దేశంలో మైనింగ్/గని కార్యకలాపాలతో ప్రభావితమయ్యే ప్రజల భావజాలాలు, పరిసరాల యాజమాన్యాన్ని మెరుగుపర్చడానికి నిర్దేశించిన దాతృత్వ నిధి ఇది. మైన్స్, మినరల్స్ (డెవలప్‌మెంట్, రెగ్యులేషన్) అమెండ్‌మెంట్ యాక్ట్–2015 ప్రకారం అమలు చేశారు. ప్రతీ మైనింగ్ ప్రభావిత జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ట్రస్ట్‌గా దీన్ని ఏర్పాటు చేస్తోంది.
గోదావరిఖని: సింగరేణి విస్తరించిన జిల్లాల్లో కేటాయించే డీఎంఎఫ్‌టీ నిధులు ఇతర ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం గుర్తించింది. తెలంగాణకు తలమానికమైన సింగరేణి డీఎంఎఫ్‌టీ నిధులు ఇక్కడే ఖర్చుచేయాలనే నిబంధన ఉన్నా.. కొన్ని లోపాలను ఆసరాగా చేసుకుని సింగరేణేతర నియోజకవర్గాలకు తీసుకెళ్తున్నట్లు తేల్చింది. పలుకుబడి, రాజకీయ జోక్యం ఇందుకు కారణమవుతోందని భావిస్తోంది. గతంలో సిరిసిల్ల, సిద్దిపేటకు తరలివెళ్లిన డీఎంఎఫ్‌టీ నిధులు ఇప్పుడు కొడంగల్‌కు కూడా తరలించారనే అభియోగాలున్నాయి. దీంతో కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్‌రెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. దీనిపై అధ్యయనం చేశాక సింగరేణి విస్తరించిన పది జిల్లాల్లోనే ఈ నిధులు వినియోగించేలా చట్టం చేయాలని యోచిస్తున్నారు. నిధుల దుర్వినియోగం, చట్టం తీరుపై ఇటీవల ఆరా తీశారు. ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లి చట్టంలోని లొసుగుల్ని తొలగించేలా విన్నవించనున్నారు. ఈ నేపథ్యంలో డీఎంఎఫ్‌టీలో కీలక మార్పులు, చేర్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది.
డీఎంఎఫ్‌టీ నిధులు ఎలా?
మైనింగ్ లీజ్‌దారులు ప్రభుత్వం తీసుకునే రాయల్టీ/సీనరేజీ ఫీజుకు అదనంగా ట్యాక్స్ చెల్లిస్తారు. ట్యాక్స్ శాతం రాష్ట్రానికి అనుగుణంగా ఉంటుంది. ఇలా సేకరించిన నిధి నిల్వ చేస్తారు. ఇందులో 98 శాతం డీఎంఎఫ్‌టీ ఖాతాకు చేరుతుంది. మిగతాది మైనింగ్ ఉన్న ప్రాంతాల్లో పాలనాపరమైన ఖర్చులకు ప్రభుత్వం ఉపయోగించవచ్చు. డీఎంఎఫ్‌టీ ఖాతాలోంచి కనీసం 60–70 శాతం నిధులు ప్రజాసంక్షేమానికి ఉపయోగించాలి. ఇందులో తాగునీటి శుద్ధి, ఆరోగ్యం, విద్య, శిక్షణ, ఉద్యోగ నైపుణ్యం, మహిళా శిశు సంక్షేమం, వృద్ధులు, వికలాంగులు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, రోడ్లు, పొలాలు, డ్రైనేజీ, వాటర్ వే ప్రాజెక్టులు, సేద్యం, ఇరిగేషన్, నీటినిల్వలు, శక్తి వాటర్‌షెడ్స్ వంటి వనరుల అభివృద్ధికి కేటాయించాలి. కలెక్టర్ ఆధ్వర్యంలోని గవర్నింగ్ కౌన్సిల్ దీన్ని పర్యవేక్షిస్తుంది.
రూ.1,700 కోట్ల నిల్వలు
డీఎంఎఫ్‌టీ నిధులు రూ.1,700 కోట్లు నిల్వ ఉన్నట్లుగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. మరోవైపు సింగరేణికి రాష్ట్రప్రభుత్వం రూ.51 వేల కోట్లకుపైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని విడుదల చేస్తే అందులో రూ.1,700 కోట్లు డీఎంఎఫ్‌టీకి జమ చేస్తుందని చెబుతున్నారు. ఈ నిధులను నిబంధనల ప్రకారం వినియోగించాలని కేంద్రప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఈ అంశాలపై అధికారులతో చర్చించి సింగరేణి విస్తరించిన పది జిల్లాల అభివృద్ధికే ఈ నిధులు కేటాయించాలని సూచించారు. కాగా, సింగరేణి బోర్డు ఆఫ్ డైరెక్టర్లుగా కేంద్రప్రభుత్వం ఇద్దరిని నియమిస్తోంది. అయితే ప్రతీ సమావేశంలో వీరు పెద్దగా పోషించే పాత్రేమీలేదని గుర్తించారు. సింగరేణి అభివృద్ధి, స్థానికులకు ప్రయోజనం జరగడంలేదని కేంద్రప్రభుత్వం భావిస్తోంది. ఈసారి సమర్థవంతమైన ఇద్దరు అధికారులను నియమించేలా చర్యలు తీసుకుంటోంది.
సింగరేణి ప్రభావిత జిల్లాల్లో వినియోగంపై దృష్టి
సింగరేణేతర నియోజకవర్గాలకు నిధులు తరలిస్తున్నట్టు గుర్తింపు
ప్రధానితో భేటీ కానున్న బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి


