హస్తంలో టికెట్ల కుస్తీ!
నేటి నుంచి దరఖాస్తులు
కరీంనగర్ కార్పొరేషన్: రాష్ట్రంలో అధికార పార్టీగా కాస్త అనుకూల వాతావరణం.. గతంతో పోల్చితే కొద్దిగా సానుకూల పరిస్థితి.. మజ్లిస్ కలిసొస్తే మేయర్ పీఠంపై గురి.. కానీ.. షరా మామూలుగానే పార్టీలో గందరగోళం.. కొరవడిన సమన్వయం.. ఉన్న నలుగురు నేతల్లో ఎవరి దారి వారిదే.. అప్పుడే మొదలైన టికెట్ల పంచాయితీ. ఇది నగరపాలకసంస్థ ఎన్నికల వేళ నగరంలో కాంగ్రెస్ పార్టీ దుస్థితి.
టికెట్లు ఇచ్చేదెవరు?
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతున్న తరుణంలో అధికార కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. సమన్వయం చేసే నేతలు కరువవడంతో, ఉన్న నాయకుల్లో ఎవరి దారి వారిదే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. అప్పుడే పార్టీలో టికెట్ల పంచాయితీ ప్రారంభం కాగా.. చేరికలు, టికెట్ల హామీలు వర్గపోరును తీవ్రస్థాయికి చేరుస్తోంది. ఓ వైపు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జీ వెలిచాల రాజేందర్‌రావు, మరో వైపు కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతున్నారు. కరీంనగర్‌లో కాంగ్రెస్‌ను గెలిపించాలని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి తనకు బాధ్యతలు అప్పగించారంటూ వెలిచాల దూకుడుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ నిబంధనలకు లోబడి, పీసీసీ ఆదేశాల మేరకు కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షుడిగా నగరం బాధ్యత తనదేనని అంజన్‌కుమార్ మరో వైపు కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే పార్టీలో చేరికలు, టికెట్ల హామీలు ఆయా నేతల నడుమ చిచ్చుపెడుతున్నాయి.
ఇన్‌చార్జిగా ‘తుమ్మల’
మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఇన్‌చార్జిగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక మంత్రిని నియమించగా, కరీంనగర్ పార్లమెంట్‌కు తుమ్మలను నియమించారు. కరీంనగర్ నగరానికి సంబంధించి నేతల్లో కొరవడిన సమన్వయం తుమ్మలకు సవాల్‌గా మారనుంది. నగరపాలకసంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి నేతల కుమ్ములాటలు ఆటంకంగా మారే అవకాశం ఉంది. దీంతో ముందుగా నగర నేతలను ఆయన సమన్వయ పరచాల్సి ఉంటుంది. నగరంలో పార్టీని ఏకతాటిపై నడిపించకపోతే, ఎన్నికల్లో తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
పార్టీ టికెట్లు ఆశిస్తున్న నాయకుల నుంచి డివిజన్లవారీగా మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఆదేశాలతో డీసీసీ కార్యాలయంలో కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మూడు రోజుల పాటు నగరంలోని 66 డివిజన్లవారీగా దరఖాస్తులు సేకరించనున్నారు. ఇలా వచ్చిన దరఖాస్తులను స్క్రీనింగ్ చేసి డివిజన్‌కు మూడు నుంచి నాలుగు పేర్లను నిర్ణయించి, పీసీసీకి పంపించనున్నారు. డివిజన్ వారిగా వచ్చిన దరఖాస్తుల్లో సామాజిక సమీకరణలు, విజయావకాశాలను పరిగణలోకి తీసుకొని, ప్రాబబుల్స్ జాబితా రూపొందించనున్నారు. ఇందుకోసం నగరంలో పార్టీ సీనియర్లతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడి నుంచి పంపించిన జాబితా ఆధారంగా పీసీసీ స్క్రీనింగ్ కమిటీ అభ్యర్థులను నిర్ణయిస్తుందని పార్టీ నాయకులు తెలిపారు.


