కార్టూన్‌తో మార్పు సాధ్యం
సప్తగిరికాలనీ(కరీంనగర్): వేగవంతమైన ప్రస్తుత కాలంలో తక్కువ సమయంలోనే ప్రజలపై లోతైన ప్రభావం చూపగల శక్తివంతమైన మాధ్యమం కార్టూన్లు అని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. తెలంగాణ కార్టూనిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాలలో రాష్ట్రస్థాయి ప్రదర్శనను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమాజంలోని రుగ్మతలను ప్రశ్నించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి వ్యంగ్య చిత్రాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. కార్టూనిస్టుల ప్రతిభను మరింతగా ప్రోత్సహించేందుకు వారి చిత్రాల ప్రదర్శన కోసం శాశ్వత వేదికను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రం నలుమూలలకు చెందిన వివిధ కార్టూనిస్టుల ప్రదర్శనలు ఆలోచింపజేస్తున్నాయన్నారు. ఎస్సారార్ ప్రిన్సిపాల్ కలువకుంట్ల రామకృష్ణ, తెలంగాణ కార్టూనిస్టు వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు జాకీర్ హుస్సేన్, రాజమౌళి, కల్యాణం శ్రీనివాస్, భూపతి, బూర్ల వెంకటేశ్వర్లు, ప్రకాశ్, శ్రీనివాస్, మెట్టు వెంకటేశ్వర్లు, మాలతీదేవి పాల్గొన్నారు.
ప్రతీ పాఠశాలను సందర్శించాల్సిందే
కరీంనగర్ అర్బన్: ప్రతీ పాఠశాలను సందర్శించి, నివేదిక ఇవ్వాలని కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ నెలాఖరులోపు జిల్లాలోని ప్రతి పాఠశాలను ప్రత్యేక అధికారులు సందర్శించాలని ఆదేశించారు. పదోతరగతి పరీక్షల సన్నద్ధత, ప్రత్యేక తరగతులు, ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు, విటమిన్ గార్డెన్ నిర్వహణ, ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు, నిర్వహణ తదితర అంశాలపై నివేదిక సమర్పించాలన్నారు. జల్ సంచయ్ జన్ భాగీదారి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో వర్షపు నీటిని ఒడిసిపట్టే నిర్మాణాలు ఎక్కడెక్కడ జరిగాయో వాటికి సంబంధించిన ఫొటోలు జీపీఎస్ ద్వారా నిర్దిష్ట వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్, డీఈవో అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలని తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు మహేశ్వర్, రమేశ్‌బాబు పాల్గొన్నారు.


